‘సిల్లీ సోల్స్’ స్మృతి కుటుంబానిదే
ABN , First Publish Date - 2022-08-04T10:38:44+05:30 IST
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబ సభ్యులు గోవాలో అక్రమంగా బార్ నడుపుతున్నారన్న విషయమై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.
- జీఎస్టీ నంబరు, అడ్రస్ ఆమె భర్త కంపెనీదే
- గోవా కాంగ్రెస్ నాయకుడు గిరీశ్ ఆరోపణ
పణజీ, ఆగస్టు3: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబ సభ్యులు గోవాలో అక్రమంగా బార్ నడుపుతున్నారన్న విషయమై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. గోవా కాంగ్రెస్ నాయకుడు గిరీష్ చోడాంకర్ బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆ బార్ స్మృతి కుటుంబ సభ్యులదే అనడానికి మరికొన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సిల్లీ సోల్స్ బార్ అండ్ రెస్టారెంట్‌ను స్మృతి కుమార్తె జోయిష్ ఇరానీ (18) అక్రమంగా నడుపుతున్నట్టు ఆరోపించారు. ఆ బార్-- హౌస్ నెంబరు 452, బౌటా వడ్డో, అస్సాగావ్ విలేజ్ అనే చిరునామాలో ఉందని తెలిపారు. అదే చిరునామాలో స్మృతి భర్త జుబిన్ ఇరానీ, ఇతర కుటుంబ సభ్యులు నడుపుతున్న ఎయిటాల్ ఫుడ్ అండ్ బేవరేజ్ చిరునామా కూడా ఉందని చెప్పారు. ఈ కంపెనీకి ఉన్న జీఎస్టీ నెంబరు, సిల్లీ సోల్స్‌కు ఉన్న జీఎస్టీ నెంబరు ఒక్కటేనని తెలిపారు. ప్రముఖ ఫుడ్ క్రిటిక్ కునాల్ విజయ్‌కర్‌కు ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూలో ఈ బార్ తనదేనంటూ జోయిష్ ఇరానీ అంగీకరించారని గిరీష్ చోడాంకర్ గుర్తు చేశారు. ఈ వాస్తవాల నేపథ్యంలో స్మృతిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను గోవా బీజేపీ అధికార ప్రతినిధి ఉర్ఫాన్ ముల్లా ఖండించారు. ఈ విషయమై మాట్లాడేందుకు చోడాంకర్‌కు ఎలాంటి అధికారం లేదని అన్నారు.