బాలలు ఉదయం ఏడు గంటలకు బడికెళ్తున్నపుడు, సుప్రీంకోర్టు ఉదయం 9 గంటలకు ఎందుకు ప్రారంభం కాకూడదు? : జస్టిస్ లలిత్

ABN , First Publish Date - 2022-07-15T18:05:38+05:30 IST

సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ యూ లలిత్

బాలలు ఉదయం ఏడు గంటలకు బడికెళ్తున్నపుడు, సుప్రీంకోర్టు ఉదయం 9 గంటలకు ఎందుకు ప్రారంభం కాకూడదు? : జస్టిస్ లలిత్

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ యూ లలిత్ (Uday U Lalit) శుక్రవారం న్యాయమూర్తులు, న్యాయవాదులకు ఓ ప్రశ్నను సంధించారు. బాలలు రోజూ ఉదయం ఏడు గంటలకే బడికి వెళ్ళగలుగుతున్నపుడు, న్యాయమూర్తులు, న్యాయవాదులు రోజూ ఉదయం 9 గంటలకు విధులను ఎందుకు ప్రారంభించలేరని ప్రశ్నించారు. 


పని దినాల్లో ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు కార్యకలాపాలు జరుగుతాయి. దీనికి భిన్నంగా జస్టిస్ ఉదయ్ యూ లలిత్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు కేసుల విచారణను ప్రారంభించారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు ధూలియా కూడా ఉన్నారు. 


ఓ బెయిలు కేసులో హాజరైన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) మాట్లాడుతూ, త్వరగా విచారణ ప్రారంభించినందుకు న్యాయమూర్తులను ప్రశంసించారు. కోర్టులు ప్రారంభమవడానికి చాలా చక్కని సమయం ఉదయం 9.30 గంటలు అని చెప్పవచ్చునని తెలిపారు. కోర్టులు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవడం సరైనదని చెప్పారు. 


జస్టిస్ లలిత్ స్పందిస్తూ, కోర్టు కార్యకలాపాలు త్వరగా ప్రారంభమవాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం 9 గంటలకు విచారణలు ప్రారంభించడం సరైనదవుతుందన్నారు. మన పిల్లలు ఉదయం ఏడు గంటలకు బడికి వెళ్లగలుగుతున్నపుడు, మనం ఉదయం 9 గంటలకు కోర్టుకు ఎందుకు రాలేమని ప్రశ్నించారు. 


సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవాలని, ఉదయం 11.30 గంటలకు అర గంట సేపు విరామం తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ ప్రారంభించాలన్నారు.  దీనివల్ల సాయంత్రం మరిన్ని ఎక్కువ పనులు చేయడానికి వీలవుతుందన్నారు. 


ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్‌వీ రమణ (Justice NV Ramana) తర్వాత ఆ పదవిని జస్టిస్ లలిత్ చేపట్టే అవకాశం ఉంది. ఆ పదవిని ఆయన చేపడితే ఆగస్టు 27 నుంచి నవంబరు 8 వరకు కొనసాగుతారు. 


Read more