రూ.20 లక్షలు దొంగిలించి.. టీవీ స్క్రీన్‌పై ఏం రాశాడో తెలుసా..
ABN , First Publish Date - 2022-05-25T21:38:55+05:30 IST
దొంగల్లో మంచి దొంగలు ఉంటారో లేదో తెలియదు. చిలిపి దొంగలు ఉంటారనేలా ఉంది ఓ దొంగల ముఠా వ్యవహరించిన తీరు.

పనాజీ : దొంగల్లో మంచి దొంగలు ఉంటారో లేదో తెలియదు. చిలిపి దొంగలు ఉంటారనేలా ఉంది ఓ దొంగల ముఠా వ్యవహరించిన తీరు. ఓ బంగ్లాలో రూ.20 లక్షల విలువైన వస్తువులు, నగదును కొట్టేసి.. ఇంటి ఓనర్‌కి ఐ లవ్ యూ చెప్పారు. ఇంట్లోని టీవీ స్క్రీన్‌పై మార్కర్‌తో ఈ సందేశాన్ని రాశారు. గోవాలో వెలుగుచూసిన ఈ దొంగతనానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
దక్షిణ గోవాలోని మార్గావో పట్టణంలో నివాసముంటున్న అసిబ్ జిక్ అనే వ్యక్తి 2 రోజుల హాలిడే ట్రిప్‌కు వెళ్లాడు. రెండు రోజులపాటు హాయిగా గడిపి మంగళవారం ఇంటికి చేరుకున్న అతడికి పెద్ద షాకే ఎదురైంది. ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించాడు. రూ.20 లక్షల విలువైన బంగారం, వెండి అభరణాలతోపాటు రూ.1.5 లక్షల నగదు కూడా అపహరణకు గురయ్యాయని తెలుసుకున్నాడు. అయితే విలువైన వస్తువులు పోగొట్టుకుని బాధలో ఉన్న ఆయన్ని ఆశ్చర్యానికి గురిచేసే ఓ సందేశం కనిపించింది. ఇంట్లోని టీవీ స్క్రీన్‌పై దొంగలు ‘ఐ లవ్ యు’ అని సందేశాన్ని రాశారు. ఇంటి ఓనర్ జరిగిన విషయాన్ని యథాతథంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దొంగతనంపై మార్గావో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. కాగా దొంగలు బంగ్లాలోకి చొరబడ్డారని, కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. నిందితులను పట్టుకుంటామని మార్గావో స్టేషన్ ఇన్స్పెక్టర్ సచిన్ నర్వేకర్ దీమావ్యక్తం చేశారు.