బ్యాంకుల రికవరీ ప్రొసీడింగ్స్‌కు అడ్డు తగలొద్దు : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-01-14T19:13:42+05:30 IST

రుణగ్రహీతలపై ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ చేపట్టే రికవరీ ప్రొసీడింగ్స్‌ను

బ్యాంకుల రికవరీ ప్రొసీడింగ్స్‌కు అడ్డు తగలొద్దు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : రుణగ్రహీతలపై ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ చేపట్టే రికవరీ ప్రొసీడింగ్స్‌ను నిరోధించవద్దని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. రుణ గ్రహీతలు రాజ్యాంగంలోని అధికరణ 226 ప్రకారం రిట్ పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేయడం కోర్టు ప్రక్రియను దుర్వినియోగపరచడమేనని తెలిపింది. ఈ విధంగా కోర్టు ప్రక్రియను దుర్వినియోగపరిచే రుణదాతలను ప్రోత్సహించవద్దని తెలిపింది. రికవరీ ప్రొసీడింగ్స్‌‌‌‌ను చేపట్టేందుకు ఉపయోగపడే చట్టాల ప్రాధాన్యాన్ని వివరించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.


బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ రుణాలను తిరిగి రాబట్టుకోవడానికి అవసరమైన యంత్రాంగాలను SARFAESI (సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఫర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్) యాక్ట్ వంటి చట్టాలు కల్పిస్తున్నాయని తెలిపింది. రుణగ్రహీతకు జారీ అయిన వివిధ నోటీసులను సవాల్ చేసే ప్రక్రియను SARFAESI చట్టం నిర్దేశించిందని, ఇటువంటి ఆర్డర్లు, నోటీసులపై రిట్ పిటిషన్లను హైకోర్టులు అనుమతించరాదని తెలిపింది. రుణ గ్రహీతలు తనకు చెల్లించవలసిన, బాకీ ఉన్న సొమ్మును తిరిగి రాబట్టుకునే హక్కు సెక్యూర్డ్ క్రెడిటర్, దాని అసైనర్‌కు ఉందని పేర్కొంది. హైకోర్టు ఇచ్చే నిలుపుదల ఉత్తర్వుల ప్రభావం సెక్యూర్డ్ క్రెడిటర్/అసైనర్ ఆర్థిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూలంగా ఉంటుందని వివరించింది. 


విశ్వభారతి విద్యా మందిర్, సెయింట్ ఆన్స్ ఎడ్యుకేషన్ సొసైటీలకు ఫీనిక్స్ ఏఆర్‌సీ ప్రైవేట్ లిమిటెడ్ రుణాలు ఇచ్చింది. ఈ రెండు సంస్థలు రూ.117 కోట్ల మేరకు బాకీ పడ్డాయి. 2013 నుంచి 2015 మధ్యలో ఈ సంస్థలు రుణాల చెల్లింపులో పదే పదే నిర్లక్ష్యం ప్రదర్శించడంతో, SARFAESI చట్టం ప్రకారం ఫీనిక్స్ ఏఆర్‌సీ ప్రైవేట్ లిమిటెడ్ నోటీసులు పంపించింది. తనకు తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని నోటీసులు ఇచ్చింది. 


ఈ రుణ గ్రహీత సంస్థలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకునే విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. రుణ గ్రహీతలు ఫీనిక్స్ సంస్థకు 2015 ఆగస్టులో రూ.1 కోటి చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను 2017, 2018లలో మరోసారి పొడిగించింది. దీంతో ఫీనిక్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 


Read more