పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ప్రియుడు.. 23 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వని కోర్టు

ABN , First Publish Date - 2022-07-16T22:56:40+05:30 IST

ప్రియుడితో కాపురం చేసి గర్భం దాల్చిన ఓ అవివాహిత ఇప్పుడు చిక్కుల్లో పడింది. 23 వారాల గర్భవతి అయిన ఆమెను

పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ప్రియుడు.. 23 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వని కోర్టు

న్యూఢిల్లీ: ప్రియుడితో కాపురం చేసి గర్భం దాల్చిన ఓ అవివాహిత ఇప్పుడు చిక్కుల్లో పడింది. 23 వారాల గర్భవతి అయిన ఆమెను పెళ్లాడేందుకు ప్రియుడు నిరాకరించాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె తన గర్భాన్ని తీయించుకోవాలని నిర్ణయించుకుని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడ కూడా ఆమెకు ఎదురుదెబ్బే తగిలింది. ఈ విషయంలో తామేమీ చేయలేమని, 23 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి కోర్టు అంగీకరించదని తేల్చి చెప్పింది. 


 20 వారాలు దాటక చట్ట ప్రకారం అబార్షన్‌కు అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, 24 వారాల వరకు గర్భిణులు వైద్యపరంగా గర్భస్రావం చేసుకోవడానికి అవివాహిత మహిళలను మినహాయించడం వివక్షతో కూడుకున్నదన్న ఆ మహిళ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ విషయంలో స్పందించాలని కేంద్రాన్ని కోరింది.


ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 25 ఏళ్ల అవివాహిత పరస్పర అంగీకారంతో ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. అతడి వల్ల ఆమె గర్భం దాల్చింది. ఈ నెల 18తో ఆమె గర్భం దాల్చి 24 వారాలు అవుతుంది. అయితే, ఇప్పుడా వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు తిరస్కరించడంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెళ్లి చేసుకోకుండా తల్లిని కావడం వల్ల మానసిక వేదన అనుభవించాల్సి వస్తుందని, అలాగే సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె కోర్టుకు తెలిపింది. అంతేకాక, తల్లిని కావడానికి మానసికంగా తాను ఇంకా సిద్ధం కాలేదని పేర్కొంది.


ఆమె వాదనలు విన్న చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం న్యాయస్థానం తన అధికారాన్ని ఉపయోగించుకునేటప్పుడు చట్టానికి మించి వెళ్లలేదని స్పష్టం చేసింది. కాబట్టి 23 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వలేమని పిటిషనర్‌కు తేల్చిచెప్పింది.


అలాగే, పిటిషనర్‌కు ఓ సలహా కూడా ఇచ్చింది. ప్రసవం అయ్యే వరకు వేరే ఎక్కడైనా సురక్షితంగా ఉండి, ఆ తర్వాత పుట్టిన శిశువును దత్తత ఇచ్చుకోవాలని న్యాయస్థానం సూచించింది. కావాలంటే ఈ విషయంలో తాము హామీ ఇవ్వగలమని పేర్కొంది. దత్తత తీసుకునేందుకు చాలా పెద్ద క్యూ ఉందని కోర్టు తెలిపింది. అయితే, కోర్టు సలహాను పిటిషనర్ తరపు లాయర్ తిరస్కరించడంతో పిటిషన్‌పై ఆర్డర్ జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. 

Read more