Amarnath Yatra : శ్రీనగర్ నుంచి అమర్నాథ్కు హెలికాప్టర్ సేవలు ఈ ఏడాది నుంచే!
ABN , First Publish Date - 2022-06-09T23:09:18+05:30 IST
అమర్నాథ్ భక్తులకు శుభవార్త! శ్రీనగర్ నుంచి అమర్నాథ్కు హెలికాప్టర్

న్యూఢిల్లీ : అమర్నాథ్ భక్తులకు శుభవార్త! శ్రీనగర్ నుంచి అమర్నాథ్కు హెలికాప్టర్ సేవలు ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. శ్రీనగర్ నుంచి పంచ తరణి వరకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించాలని జమ్మూ-కశ్మీరు పరిపాలనా యంత్రాంగాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న పంచ తరణి నుంచి ఆరు కిలోమీటర్లు కాలి నడకన లేదా గుఱ్ఱాలు లేదా పల్లకీల ద్వారా వెళ్లి, పవిత్రమైన, దివ్యమైన అమర్నాథ్ గుహకు చేరుకోవచ్చు.
అమర్నాథ్ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది. బల్టాల్, పహల్గామ్ల గుండా అమర్నాథ్కు వెళ్ళవచ్చు. ఈ రెండు మార్గాల గుండా ప్రయాణించి, పంచ తరణి చేరుకోవాలి. అక్కడి నుంచి అమర్నాథ్ గుహకు వెళ్ళాలి. ఈ రెండు చోట్ల నుంచి హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు హెలికాప్టర్ కోసం ఇక్కడి వరకు రాకుండా శ్రీనగర్ నుంచే హెలికాప్టర్లో ప్రయాణించడానికి అవకాశం లభిస్తుంది. ఇక వీరు హెలికాప్టర్ కోసం రోడ్డు మార్గంలో బల్టాల్కు లేదా పహల్గామ్కు వెళ్ళవలసిన అవసరం ఉండదు.
కోవిడ్ కారణంగా రెండేళ్ళ అనంతరం అమర్నాథ్ (Amarnath) యాత్ర పునఃప్రారంభమవుతుండటంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం (Central Government) అంచనా వేస్తోంది. మరోవైపు ఉగ్రవాద సంస్థల హెచ్చరికల నేపథ్యంలో భక్తులకు భద్రత కల్పించే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, శ్రీనగర్ (Srinagar) నుంచి హెలికాప్టర్ (Helicopter) సర్వీసులను ప్రారంభించాలని ఆదేశించింది.