దేశవాళీ ఆవుల కొనుగోలుకు రూ.25వేల subsidy
ABN , First Publish Date - 2022-06-27T18:18:05+05:30 IST
ఆవుపాల ఉత్పత్తిదారులకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది....

చండీఘడ్: ఆవుపాల ఉత్పత్తిదారులకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశీయ జాతి ఆవుల కొనుగోలుపై రూ.25,000 వరకు సబ్సిడీని ప్రకటించారు.హర్యానా రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఖట్టర్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్‌లో రెండు నుంచి ఐదెకరాల భూమి ఉన్న రైతులు స్వచ్ఛందంగా సహజ వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తున్నారని, వారికి దేశవాళీ ఆవులను కొనుగోలు చేసేందుకు సబ్సిడీని అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి బ్లాక్‌లో సహజ వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేస్తామని ఖట్టర్ తెలిపారు.
కర్నాల్‌లో ఏర్పాటు చేసిన సహజ వ్యవసాయంపై రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వ్యవసాయ నిపుణులతో మాట్లాడారు.వ్యవసాయ శాఖ రూపొందించిన పోర్టల్‌లో ఇప్పటి వరకు రాష్ట్రంలోని 1,253 మంది రైతులు సేంద్రీయ సేద్యం పద్ధతిని అనుసరించేందుకు స్వచ్ఛందంగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని సీఎం వివరించారు.