Dera Baba : డేరా బాబానా మజాకానా? పెరోల్‌పై వచ్చి మరీ...

ABN , First Publish Date - 2022-10-26T17:05:07+05:30 IST

న్యూఢిల్లీ: పెరోల్‌పై బయటకు వచ్చిన డేరా బాబా.. దీపావళి రాత్రి స్వయంగా తన మ్యూజిక్ వీడియోను విడుదల చేసి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. పెరోల్‌పై విడుదలై ఈ తరహా ప్రచార హంగామా చేయవచ్చా అనేది పక్కనపెడితే ఆయన యూట్యాబ్‌లో విడుదల చేసిన ఆడియా కేవలం 24 గంటల్లోనే రికార్డు వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తోంది.

Dera Baba : డేరా బాబానా మజాకానా? పెరోల్‌పై వచ్చి మరీ...

న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ (Gurmeet Ram rahim) మరోసారి వార్తల్లోకి వచ్చారు. స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు (Self proclaimed spritual guru)గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగినప్పటికీ 2017లో అత్యాచార కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో ఆయన కెరీర్‌లో చీకట్లు కమ్మాయి. అప్పట్నించీ జైలులోనే ఉన్న డేరా బాబా గత ఐదేళ్లలో ఐదు సార్లు పెరోల్‌పై వచ్చారు. ప్రస్తుతం పెరోల్‌పై బయటకు వచ్చిన డేరా బాబా.. దీపావళి రాత్రి స్వయంగా తన మ్యూజిక్ వీడియోను విడుదల చేసి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. పెరోల్‌పై విడుదలై ఈ తరహా ప్రచార హంగామా చేయవచ్చా అనేది పక్కనపెడితే ఆయన యూట్యాబ్‌లో విడుదల చేసిన ఆడియా కేవలం 24 గంటల్లోనే రికార్డు వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తోంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో 42 లక్షల వ్యూస్ వచ్చాయి. పెరోల్‌పై వచ్చిన డేరా బాబా కేవలం అక్కడితో ఆగడం లేదు. జైలు నుంచి వచ్చిన ప్రతిసారి చేసినట్టుగానే ఈసారి కూడా ఆన్‌లైన్ సత్సంగాలు గుప్పిస్తున్నారు. పలువురు బీజేపీ నేతలు ఈ సత్సంగాలకు హాజరవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

మండిపడిన మహువా...

డేరా బాబా 'Sadi Nit Diwali' పేరుతో దీపావళికి యూట్యూబ్‌లో వీడియో విడుదల చేయగానే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) విమర్శలు గుప్పించారు. అమెరికా, బ్రిటన్ తరహాలోనే ఇక్కడ కూడా పెరోల్ రిజిస్ట్రేషన్‌ను కోడిఫైడ్ చేయాలంటూ ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పక్షపాతంతో కొద్ది మందిని మాత్రమే ఎంపిక చేసే విధంగా పెరోల్ విధానం ఉండకూడదని అన్నారు. ''చట్టాన్ని మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది'' అంటూ ఆమె వ్యంగ్యోక్తులు సంధించారు.

ఏడాదిలో రెండుసార్లు పెరోల్..

డేరా బాబు గత ఐదేళ్లలో ఐదుసార్లు పెరోల్‌పై జైలు నుంచి బయటకు రాగా, ఈసారి జనవరి, ఫిబ్రవరిలో రెండుసార్లు బయకు వచ్చారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులని కలవాలని, కొన్ని సార్లు ఆశ్రమంలో ఉండదలచుకున్నానని ఆయన లీవ్ తీసుకున్నారు. జైలు నుంచి విడుదలైన సమయంలో ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉంటోంది. ఈసారి కూడా ఆయనకు సుదీర్ఘ సెలవు (long leave) దొరికింది. ఈ లీవు సమంలో ఆయన సొంత మ్యూజిక్ వీడియో విడుదల చేసుకున్నారు. ఈ వీడియోకు రచన, సంగీత, దర్శకత్వం కూడా ఆయనే వహించారు. గుర్మీత్ ఆరు ఆల్బమ్స్ ఇంతవరకూ రిలీజ్ చేయగా, చివరిసారిగా 2014లో 'హైవే లవ్ చార్జర్' పేరుతో ఆల్బమ్ విడుదలైంది. అది విడుదలైన 3 రోజుల్లో 30 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. గుర్మీత్ తన కొత్త మ్యూజిక్ వీడియో ఒక భజన్ అని, దేవుడి పేరుతో చేసిన పాట అని చెబుతున్నారు.

సత్సంగంపై వివాదం..

గుర్మీత్ పెరోల్‌పై వచ్చినప్పుడు తరచు యూపీలోని బార్నవా ఆశ్రమంలోనే ఉంటూ ఆన్‌లైన్‌లో సత్సంగాలు సాగిస్తుంటారు. యూపీ, హర్యానాకు చెందిన చాలామంది బీజేపీ నేతలు తరచు ఇక్కడ బస చేస్తుంటారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. 'రేపిస్ట్ బాబా' సత్సంగానికి ఈ మధ్యనే బీజేపీ ఎమ్మెల్యే ఒకరు హాజరైనట్టు తెలిపింది. 2002లో ఆశ్రమంలో ఉండే ఇద్దరు విద్యార్థినులపై డేరా బాబా అత్యాచారానికి పాల్పడిన కేసులో 2017 ఆగస్టు 28న ఆయనను దోషిగా కోర్టు నిర్ధారించింది. 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో ఆయనకు 2019లో యావజ్జీవ జైలుశిక్ష పడింది.

Updated Date - 2022-10-26T18:51:27+05:30 IST