గల్ఫ్‌ కార్మికుల తిరుగు వలస

ABN , First Publish Date - 2022-02-23T08:26:43+05:30 IST

వ్యవసాయానికి సాగునీటి వనరుల లోటు.. ఒకప్పుడు గల్ఫ్‌ వలసలకు ప్రధాన కారణాల్లో ఒకటి. సాగు గిట్టుబాటు కాక కొందరు,...

గల్ఫ్‌ కార్మికుల తిరుగు వలస

చమురు నేల నుంచి మాతృ భూమికి పయనం.. సాగునీటి లభ్యతతో మారిన ప్రవాసుల మనసు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

వ్యవసాయానికి సాగునీటి వనరుల లోటు.. ఒకప్పుడు గల్ఫ్‌ వలసలకు ప్రధాన కారణాల్లో ఒకటి.  సాగు గిట్టుబాటు కాక కొందరు, బోరు బావుల తవ్వకంతో  ఎదురైన అప్పులను తీర్చేందుకు మరికొందరు.. ఎడారి దేశాలకు వెళ్లేవారు. కానీ, కొంతకాలంగా పరిస్ధితి మారుతోంది. గల్ఫ్‌కు వచ్చే కార్మికుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. ఏమైనా సరే మాతృ దేశంలోనే పనిచేసుకుందామనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తెలంగాణ పల్లెల్లో ఒకప్పుడు రాజ్యమేలిన ‘గల్ఫ్‌ దళారుల సంస్కృతి’ కనుమరుగవుతోంది. అంతర్జాతీయ చమురు విపణిలో ఒడిదుడుకులతో గల్ఫ్‌ దేశాల్లో ఆదాయం తగ్గింది. అభివృద్ధి పనులు మందగించాయి. దీనికితోడుగా సంస్కరణలు, కొవిడ్‌ కారణంగా నిర్మాణ రంగం కుప్పకూలింది. దీనిపై ఆధారపడ్డ తెలంగాణ యువతకు ఎడారి దేశాలు ఎండమావులుగా మారుతున్నాయి. మరోవైపు కొన్నాళ్లుగా రాష్ట్రంలో పెరుగుతున్న భూగర్భ జలాలతో వ్యవసాయం పునరుజ్జీవం చెందుతోంది. పరాయి గడ్డపై పడే కష్టం.. సొంత గడ్డపైనే చేసుకుంటూ, కన్నవారు, భార్యాపిల్లలతో సుఖంగా ఉండొచ్చనే భావనతో చాలామంది ప్రవాసులు స్వదేశం వైపు చూస్తున్నారు. దీంతో గల్ఫ్‌ విమానాలు ఎక్కుతున్నవారు తగ్గడంతో పాటు శాశ్వతంగా తిరిగివస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. 


నాడు విరక్తితో వచ్చి.. 

మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లా గల్ఫ్‌ వలసలకు పెట్టింది పేరు. బోరు బావులు తవ్వించిన.. అప్పులు తీర్చడానికి దుబాయ్‌కి వచ్చేవారు. ఈ అప్పుతో పాటు దుబాయి వచ్చేందుకు అయిన అప్పుతో ఒత్తిళ్లను ఎదుర్కొని, జీవితం మీద విరక్తితో ప్రాణాలు తీసుకున్నవారు అనేకం. అలాంటి ఈ జిల్లాలో భూగర్భ నీటి మట్టం గత సంవత్సరం జనవరితో పోల్చితే 1.14 మీటర్లు పెరిగింది. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో కాశవేణి మహేశ్‌ గతంలో 4 బోరు బావులను 550 అడుగుల మేర తవ్వించినా నీళ్లు పడలేదు. ఇతడికి 10 ఎకరాలుంది.సంవత్సరానికి ఒక ఎకరంలో ఒక పంట పండించడమూ కష్టంగా ఉండడంతో సౌదీ అరేబియా వచ్చాడు. ఇటీవల తిరిగొచ్చాడు. నీటి లభ్యత పెరగడంతో ఇప్పుడు 6 ఎకరాల్లో మూడు పంటలు పండిస్తున్నాడు సాగునీటిని వినియోగించుకుంటూ.. గల్ఫ్‌లో కష్టపడినట్లుగా పొలంలో శ్రమిస్తే ఫలితం పొందవచ్చని నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం తుర్తికి చెందిన బాస గంగన్న అంటున్నాడు. 13 ఏళ్లు బహ్రెయిన్‌లో పనిచేసి వచ్చిన గంగన్న గ్రామంలో మొక్కజొన్నలు, జొన్నలు, పసుపుతో పాటు వరి పండిస్తున్నాడు.  వరి కాకుండా ఇతర పంటలకు కోతుల బెదడ ప్రధాన ఉందని.. దానిని పరిష్కరిస్తే ఇబ్బందులు తీరుతాయని వీరు పేర్కొంటున్నారు. 


పదేళ్లకుపైగా ఒమాన్‌లో పని చేసిన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పెద్ది రాము కొన్నేళ్ల కిందట సెలవులపై స్వదేశానికి వచ్చాడు. సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో తిరిగి గల్ఫ్‌ వెళ్లలేదు. రాముకు మూడు ఎకరాలుంది. ఎకరన్నరలో కీరా దోస, టమాట పండిస్తున్నాడు. రోజూ జగిత్యాలకు వాటిని తీసుకెళ్లి అమ్ముతున్నాడు.


12 ఏళ్లు యూఏఈలో పనిచేసిన పాచబోయిన కిశోర్‌ది సిద్దిపేట మండల కిష్టాపూర్‌ గ్రామం. యజమాని మోసగించడంతో 3 రోజులు దుబాయ్‌ విమానాశ్రయంలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఎలాగోలా మాతృభూమికి వచ్చిన కిశోర్‌.. అవమాన భారంతో సంవత్సరం పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. అయితే, తండ్రి ఓదార్పు, సాగునీరు అందుబాటులోకి రావడంతో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. వరి, కూరగాయలతో పాటు పొద్దుతిరుగుడు పండిస్తూ ఇక వెనక్కి చూడలేదు.

Read more