Morbi bridge collapse: మోర్బీ మున్సిపాలిటీపై గుజరాత్ హైకోర్టు అక్షింతలు

ABN , First Publish Date - 2022-11-15T14:59:00+05:30 IST

మోర్బి బ్రిడ్జి కుప్పకూలి 130 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

Morbi bridge collapse: మోర్బీ మున్సిపాలిటీపై గుజరాత్ హైకోర్టు అక్షింతలు

అహ్మదాబాద్: మోర్బీ బ్రిడ్జి కుప్పకూలి (Morbi bridge collapse) 130 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై గుజరాత్ హైకోర్టు (Gujarat High court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిడ్జి మెయింటెనెన్స్ కాంట్రాక్టు విషయంలో మోర్బీ మున్సిపాలిటీ ''చాలా తెలివిగా" (Very smart) వ్యవహరించిందంటూ అక్షంతలు వేసింది. ''మున్సిపాలిటీ తప్పిదానికి 135 మంది ప్రాణాలు కోల్పోయారు'' అని కోర్టు అభిప్రాయపడింది. నోటీసు ఇచ్చినప్పటికీ ఇవాళ ఒక్క అధికారి కూడా రాలేదని బెంచ్ వ్యాఖ్యానించింది. ''చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు'' అంటూ మండిపడింది. మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్‌పై ఇంకా ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. దీనిపై కారణాలు తమకు అందజేయాలని ఆదేశించింది.

ఒక పెద్ద రాష్ట్రం అయినప్పటికీ టెండర్ లేకుండా కాంట్రాక్టు మంజూరు చేసినట్టు కనిపిస్తోందని హైకోర్టు పేర్కొంది. ప్రజలు సందర్శించే బ్రిడ్జి మరమత్తు పనులకు ఎందుకు టెండరు పిలవలేదు? బిడ్‌లు ఎందుకు ఆహ్వానించలేదు'' అని రాష్ట్ర చీఫ్ సెక్రటరీని చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం ప్రారంభమైన కోర్టు విచారణ బుధవారంనాడు కూడా కొనసాగనుంది.

ఒక ముఖ్యమైన పని పూర్తి చేసే విషయంలో ఒకటిన్నర పేజీలో అగ్రిమెంట్ ఎలా కుదుర్చుకుంటారని కోర్టు ప్రశ్నించింది. ఒరెవా సంస్థకు మోర్బీ బ్రిడ్జి పనులను 15 ఏళ్ల కాంట్రాక్టుకు మున్సిపాలిటీ అప్పగించింది. ఎలాంటి టెండర్లు లేకుండా అజంతా కంపెనీకి పనులు ఎలా కట్టబెట్టారని కోర్టు నిలదీసింది. కోర్టు సుమోటోగా ఈ కేసును విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోష్ జె శాస్త్రి ఈ కేసు విచారణ జరుపుతున్నారు. బ్రిడ్జి మెయింటెనెన్స్ పనులకు సంబంధించిన కాంట్రాక్టు ఫైల్స్‌ను తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది.

కాగా, ప్రమాదం జరిగిన ప్రభుత్వం వెంటనే చాలా వేగంగా స్పందించి, అనేక ప్రాణాలు కాపాడినట్టు ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టుకు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని ప్రభుత్వం అరెస్టు చేసిందని, దోషులుగా ఎవరు తేలినా వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నష్టపరిహారం కూడా ఇచ్చినట్టు కోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ప్రకటించినట్టు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఘటనా స్థలిని సందర్శించి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున కేంద్ర సాయాన్ని ప్రకటించినట్టు ప్రభుత్వ నాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే విషయం కోర్టు తెలుసుకోవాలనుకుంటున్నట్టు న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

Updated Date - 2022-11-15T16:14:31+05:30 IST