Gujarat Elections: అభ్యర్థుల ప్రకటనలో దూసుకుపోతున్న ఆప్

ABN , First Publish Date - 2022-10-16T21:26:11+05:30 IST

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ ప్రకటించక ముందే..

Gujarat Elections: అభ్యర్థుల ప్రకటనలో దూసుకుపోతున్న ఆప్

అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల (Gujarat elections) షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ (ECI) ప్రకటించక ముందే అభ్యర్థుల జాబితా (Candidates list) విడుదలలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దూసుకుపోతోంది. తాజాగా అభ్యర్థుల ఐదవ జాబితాను ఆదివారంనాడు ఆప్ విడుదల చేసింది. ఈ జాబితాలో 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. భుజ్ నియోజకవర్గం నుంచి రాజేష్ పండోరియా, ఐదర్ నుంచి జయంతిభాయ్ పార్నమి, నికోల్ నుంచి గజెర, సబర్‌మతి నుంచి జస్వంత్ థాకోర్, టంకారా నుంచి సంజయ్ భటస్నా‌కు టిక్కెట్లు లభించాయి. కోడినా నుంచి వాల్జీభాయ్ మక్వానా, మహుధా నుంచి రావ్‌జీభాయ్ సోమభాయ్ వాఘేలా, బలాసినార్ నుంచి ఉదయ్‌సిన్హ్ చౌహాన్ పోటీ చేయనున్నారు. మోర్వా హడఫ్ నుంచి బనాభాయ్ డమోర్, ఝలోద్ నుంచి అనిల్ గరసియా, డేడియాపద నియోజవర్గం నుంచి చైతర్ వాసవ, వ్యారా నుంచి బిపిన్ చౌదరికి టిక్కెట్లు లభించాయి.


ఇంతవరకూ 53 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటన

గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసే 53 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ఇంతవరకూ ప్రకటించింది. 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లోగా ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా 12 ఏళ్ల 227 రోజులు పనిచేశారు. ఆయనకు ముందు కేశూభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా 216 రోజులు పనిచేశారు. మోదీ అనంతరం ఆనందిబెన్ పటేల్, విజయ్ కుమార్ రూపాని ముఖ్యమంత్రులుగా పనిచేయగా, ప్రస్తుతం భూపేంద్ర పటేల్ సీఎంగా ఉన్నారు. గత ఎన్నికల తరహాలో కాకుండా ఈసారి గుజరాత్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఇంతవరకూ ప్రధానంగా పోటీ ఉండేది. ఈసారి ఆప్ ఆద్మీ పార్టీ (ఆప్) పూర్తి శక్తిసామర్థ్యాలతో బరిలోకి దిగడంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. ప్రస్తుత గుజరాత్ అసెంబ్లీ గడువు 2023 ఫిబ్రవరి 18వ తేదీతో ముగియనుంది.

Updated Date - 2022-10-16T21:26:11+05:30 IST