మంకీపాక్స్‌పై మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2022-08-04T10:59:10+05:30 IST

దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుతుండటంతో వైరస్‌ కట్టడికి కేంద్రప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది.

మంకీపాక్స్‌పై మార్గదర్శకాలు

వివిధ సూచనలను జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుతుండటంతో వైరస్‌ కట్టడికి కేంద్రప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాధి సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులను గురించి వివరిస్తూ ఒక జాబితాను విడుదల చేసింది. వ్యాధి సోకిన వ్యక్తితో దీర్ఘకాలం సన్నిహితంగా ఉన్నవారెవరికైనా సరే మంకీపాక్స్‌ సోకే ప్రమాదం ఉంటుందని అందులో స్పష్టం చేసింది. ‘‘ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తిని ఇతరులకు దూరంగా విడిగా ఉంచాలి. శానిటైజర్లు లేదా సబ్బుతో చేతుల్ని నిరంతరం శుభ్రపరుచుకోవాలి. రోగికి దగ్గరగా ఉన్నప్పుడు ముఖానికి మాస్కులు, చేతికి గ్లవ్స్‌ వేసుకోవాలి’’ అని పేర్కొంది. ‘‘మంకీపాక్స్‌ వ్యాప్తిలో ఉన్న ఏ దేశానికైనా గడచిన 21 రోజుల్లో ప్రయాణించిన వ్యక్తికి వంటిపై దద్దుర్లు, లింప్‌ నోడ్స్‌లో వాపు, జ్వరం, తలపోటు, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి లక్షణాలుంటే వెంటనే మంకీపాక్స్‌గా అనుమానించి పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలితే.. ఆ వ్యక్తికి లక్షణాలు మొదలైనప్పటి నుంచి ఎవరెవరు సన్నిహితంగా మెలిగారో వారందరూ అప్రమత్తమై లక్షణాలను గమనించుకోవాలి. కాంటాక్ట్స్‌గా వ్యవహరించే వారందరినీ 21 రోజుల పాటు పరిశీలనలో ఉంచాలి. లక్షణాలు లేనప్పటికీ.. అనుమానితులు రక్తదానం, కణజాల, అవయవ, వీర్య దానాలు చేయరాదు’’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యాధి కట్టడి, చికిత్సపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా. ఢిల్లీలో కొత్తగా 31 ఏళ్ల మహిళకు మంకీపాక్స్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. 

Updated Date - 2022-08-04T10:59:10+05:30 IST