GT Deve Gowda: జేడీఎస్‌ను వీడేది లేదు..
ABN , First Publish Date - 2022-10-21T18:01:15+05:30 IST
జేడీఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్యను ఓడించిన ప్రముఖుడు చాముండేశ్వరీ నియోజకవర్గ ఎమ్మెల్యే జీటీ దేవేగౌడ(GT
బెంగళూరు, అక్టోబరు20 (ఆంధ్రజ్యోతి): జేడీఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్యను ఓడించిన ప్రముఖుడు చాముండేశ్వరీ నియోజకవర్గ ఎమ్మెల్యే జీటీ దేవేగౌడ(GT Deve Gowda) మూడేళ్ళ అసంతృప్తి ఒక్కసారిగా వీగిపోయింది. గురువారం అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షులు దేవేగౌడ మైసూరు చాముండేశ్వరీదేవిని దర్శించుకునేందుకు కుటుంబీకులతో పాటు వెళ్ళారు. దర్శనం తర్వాత మైసూరులోనే ఉండే అసంతృప్తి ఎమ్మెల్యే జీటీ దేవేగౌడ నివాసానికి మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామి, నిఖిల్ సహా కుటుంబీకులంతా ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా వెళ్ళారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే దేవేగౌడ ఖంగుతిన్నారు. ఒక్కసారిగా దేవేగౌడ కుటుంబీకులను చూసిన ఆయన కన్నీరు పెట్టారు. దేవేగౌడ నాలుగైదు నెలలుగా వయోభారం సమస్యలతో ఇంటికే పరిమితంగా గడిపారు. ఇష్టదైవంగా భావించే చాముండేశ్వరీదేవిని దర్శించుకుని తొలుత దేవేగౌడ ఇంటికి వెళ్ళడం, కుటుంబీలకులందరితోను సరదాగా గడపడంతో ఒక్కసారిగా అందరిలోను భావోద్వేగం కలిగింది. ఒకరినొకరు చూసుకుని కాసేపు కంటతడి పెట్టారు. కుమారస్వామి కూడా కాసేపు మాట్లాడలేక పోయి మౌనంగా గడిపారు. సుమారు గంటకుపైగా జీటీ దేవేగౌడ ఇంట్లో కుమారస్వామి కుటుంబీకులంతా గడిపారు. అనంతరం జీటీ దేవేగౌడ(GT Deve Gowda) మీడియాతో మాట్లాడుతూ మూడేళ్ళుగా జేడీఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చానన్నారు. కానీ దేవేగౌడపై అభిమానం తగ్గలేదన్నారు. కొన్ని విషయాలలో కుమారస్వామితో విభేధాలు వచ్చినందుకే పార్టీకి దూరంగా ఉన్నానన్నారు. కానీ వ్యతిరేకంగా ఎక్కడా వ్యవహరించలేదన్నారు. దేవేగౌడను చూశాక మార్పు చెందానన్నారు. జేడీఎస్‌ను వీడి ఎక్కడికీ వెళ్ళేది లేదన్నారు. జేడీఎస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ మాట్లాడుతూ ఇదో చిన్నపాటి కుటుంబ సమస్య అని పరిష్కారమైందన్నారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం, ఎమ్మెల్సీ శరవణ సహా పలువురు ఉన్నారు.