2,500 ఏళ్లుగా పాణిని వ్యాకరణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు

ABN , First Publish Date - 2022-12-16T01:14:30+05:30 IST

మలివేద కాలంలో.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే తొలి భాషా పితామహుడిగా పేరొందిన సంస్కృత పండితుడు పాణిని రాసిన ‘అష్టాధ్యాయి’ వ్యాకరణ గ్రంథంలోని ధాతు నియమాల(మెటా

2,500 ఏళ్లుగా పాణిని వ్యాకరణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు

కీలక ‘ధాతు నియమాల’ విషయంలో జరిగిందిదే

4,000 పాణిని వ్యాకరణ నియమాల డీకోడ్‌

కేంబ్రిడ్జ్‌కు చెందిన భారత విద్యార్థి ఘనత

2,500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యలకు పరిష్కారం

లండన్‌, డిసెంబరు 15: మలివేద కాలంలో.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే తొలి భాషా పితామహుడిగా పేరొందిన సంస్కృత పండితుడు పాణిని రాసిన ‘అష్టాధ్యాయి’ వ్యాకరణ గ్రంథంలోని ధాతు నియమాల(మెటా రూల్స్‌)ను ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకున్నారా? పాణిని వ్యాకరణంపై తొలిసారిగా భాష్యం రాసిన కాత్యాయనుడు కొన్ని నిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల.. అదే సంప్రదాయం కొనసాగిందా? ఈ ప్రశ్నలకు కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృతంపై పీహెచ్‌డీ చేస్తున్న 27 ఏళ్ల భారత విద్యార్థి రిషి రాజ్‌పోపట్‌ అవునని చెబుతున్నారు. క్రీ.పూ. 4-5 శతాబ్దాల మధ్యకాలంలో భారత వాయవ్యం(ప్రస్తుతం పాక్‌-అఫ్ఘానిస్థాన్‌ల మధ్య ప్రాంతం)లో పాణిని నివసించాడనడానికి ఆధారాలున్నాయి. సంస్కృతంపై ఆయన రాసిన ‘అష్టాధ్యాయి’లోని వ్యాకరణ సూత్రాలు నేటికీ కొనసాగుతున్నాయి. ‘‘అష్టాధ్యాయిని ఇంతకాలం మన పండితులు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆయన రాసిన ఎనిమిది అధ్యాయాల వ్యాకరణ పుస్తకంలో 4,000 నిబంధనలున్నాయి. పదాలను అర్థం చేసుకోవడం, కొత్తపదాల సృష్టి, విశేషణాలు, విభక్తుల ప్రాధాన్యం.. ఇలా పలు అంశాలను ఈ నిబంధనలు స్పృశిస్తున్నాయి. గడిచిన 2,500 ఏళ్లుగా మన వాళ్లు ఈ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకుని, వివరణలు ఇచ్చారు’’ అని రిషి రాజ్‌పోపట్‌ వ్యాఖ్యానించారు. ‘‘పాణిని బోధించిన మెటారూల్‌ ప్రకారం.. సమాన ప్రాముఖ్యం కలిగిన రెండు సూత్రాల మధ్య వైరుధ్యం ఏర్పడితే.. వ్యాకరణ క్రమంలో వచ్చే తర్వాతి సూత్రం వర్తిస్తుందని ఇప్పటి వరకూ పండితులు భావించారు.

ఈ నిబంధన వ్యాకరణ కోణం నుంచి తప్పుడు ఫలితాలను ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది. పదానికి ఇరువైపులా వర్తించే నియమాల గురించి చెప్పడమే పాణిని ఉద్దేశం. పాఠకుడు కుడివైపు నియమాన్ని ఎంచుకోవాలన్నది ఆయన అభిప్రాయం. అష్టాధ్యాయిలోని 1.4.2 నిబంధన(విప్రతిశేధే పరం కార్యం)ను అర్థం చేసుకుంటే ఈ విషయం తెలుస్తుంది’’ అని రాజ్‌పోపట్‌ వాదించారు. ప్రాథమిక శబ్దాల నుంచి నూతన పదాలు, వాక్యాలను రూపొందించడానికి అవసరమైన నిబంధనలను పాణిని తన ‘అష్టాధ్యాయి’లో చక్కగా వివరించారని పేర్కొన్నారు. పాణిని అల్గారిథమ్‌ను సరిగ్గా అర్థం చేసుకుని, కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ను రూపొందిస్తే.. సంస్కృతం నుంచి ఇతర భాషల తర్జుమా కూడా సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మరో రెండున్నరేళ్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. రాజ్‌పోపట్‌ పరిశోధనకు గైడ్‌(మార్గనిర్దేశకుడు)గా ఉన్న విన్సెంజో వెర్జియాని కూడా ఈ కృషి పట్ల అభినందనలు తెలిపారు. శతాబ్దాలుగా ఎందరో పండితులు పరిష్కరించలేని సమస్యకు రాజ్‌పోపట్‌ మార్గదర్శకుడయ్యారని, ఈ పరిశోధనతో మరింత మంది సంస్కృత భాషపై ఆసక్తిచూపుతారని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-12-16T01:14:32+05:30 IST