కాల్పుల విరమణ కోసం చర్చలు జరుపుతున్న భారత్

ABN , First Publish Date - 2022-03-05T19:33:31+05:30 IST

యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తెచ్చేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని కేంద్రం ప్రకటించింది

కాల్పుల విరమణ కోసం చర్చలు జరుపుతున్న భారత్

యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తెచ్చేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని కేంద్రం ప్రకటించింది. ఒకవైపు ‘ఆపరేషన్ గంగ’ ప్రాజెక్టులో భాగంగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యపడటం లేదు. ఖార్కివ్, సుమీ వంటి ప్రాంతాల్లో నిత్యం బాంబు దాడులు, కాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతాల్లో ఉన్న భారతీయులు బయటకు రాలేని పరిస్థితి. ఈ కారణంగా అక్కడ చిక్కుకుపోయిన వెయ్యి మందికిపైగా భారతీయులను తీసుకురాలేకపోతోంది భారత ప్రభుత్వం. దీంతో భారతీయులను సురక్షిత ప్రాంతాలకు చేర్చే వరకు కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ, ఉక్రెయిన్-రష్యా ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని భారత ఎంబసీ ప్రకటించింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు దాదాపు 120 బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, భారతీయులు ఉన్న ప్రదేశానికి చేరే మార్గంలో 50-60 వరకు క్లిష్టమైన ప్రాంతాలున్నాయి. ఈ ప్రదేశాల్లో నిత్యం కాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాల్నివ్వడం లేదు. అయితే, బస్సులను వేరే మార్గంలో తరలించేందుకు ఉన్న అంశాలను పరిశీలిస్తున్నామని ఇండియన్ ఎంబసీ చెప్పింది.


మీడియాపై రష్యా ఆంక్షలు

ఉక్రెయిన్‌లో రష్యా దాడిని కవర్ చేస్తున్న మీడియాపై రష్యా ఆంక్షలు విధించింది. తమ దేశంలో ఎవరైనా దీనికి సంబంధించి అసత్య వార్తలు ప్రచారం చేస్తే 15 ఏళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించింది.

Updated Date - 2022-03-05T19:33:31+05:30 IST