Governor: భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని వివరించండి
ABN , First Publish Date - 2022-12-25T09:12:14+05:30 IST
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజెప్పాలని ఉపాధ్యాయులకు
- మద్రాసు ఐఐటీ ప్రొఫెసర్లకు గవర్నర్ సూచన
అడయార్(చెన్నై), డిసెంబరు 24: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజెప్పాలని ఉపాధ్యాయులకు రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి పిలుపునిచ్చారు. మద్రాసు ఐఐటీ(IIT Madras) ప్రాంగణంలో శనివారం బ్రిడ్జి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను ఆయన ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ రవి(Governor Ravi) మాట్లాడుతూ... దేశ భవిష్యత్తుకు అనుగుణంగా విద్యార్థులను, యువతను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు.. భారత సంస్కృతికి, అధ్యాత్మిక సందేశాన్ని వారికి అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. ముఖ్యంగా భారతీయ కళలు, సంగీతం, సంప్రదాయం, భక్తి, ఆధ్యాత్మికం, వివిధ రకాల ఆచారాలు భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమన్నారు. పైగా ఇవి ఎంతో ప్రధానమైనవన్నారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ కళలు, సంస్కృతి భారతదేశం యొక్క ఉన్నతమైన మేధో నాగరికత, ఆధ్యాత్మిక స్వరూప గొప్పతనాన్ని వివరించారు. భారతీయ కళాకారులు తమ నృత్యరీతులతో భరతమాతకు తమదైనశైలిలో నివాళులు అర్పిస్తున్నారని గుర్తు చేశారు. అలాగే, భారత్ జీ20 ప్రెసిడెన్సీపై ఆయన స్పందిస్తూ, స్వామి వివేకానంద, విశ్వగురు అరబిందో కలలుగన్న గమ్యంవైపు పయనిస్తోందన్నారు. ఇది ఒక మైలురాయి వంటిదన్నారు. మానవత్వం కోసం ప్రపంచాన్ని నడిపించగల శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని, ఇది ఒక బాధ్యతగా భారత్ నెరవేర్చుతుందన్నారు. భారతీయ కళలు, సంస్కృతిని పెంపొందించడానికి, భావి భారత నిర్మాణాన్ని స్థాపించడంలో యావజ్జాతికి తమ సేవలను అందించడమే కాకుండా, మన సంప్రదాయాల గొప్పతనాన్ని భావి తరాలకు అందించిన సాంస్కృతిక దిగ్గజాలను గౌరవించడంలో బ్రిడ్జి అకాడమీ విశేషమైన సేవలను అందిస్తుందని కొనియాడారు. భారతీయ శాస్త్రీయ కళారూపాలను ప్రజలకు తెలియజెప్పేలా, కొత్త ఆవిష్కరణలకు నాంధీ పలికేలా నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతం కావాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ మ్యూజిక్ క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్ తంగిరాల, బ్రిడ్జి అకాడమీ చైర్మన్ ఎన్.రఘురామన్, బ్రిడ్జి అకాడమీకి చెందిన అకడమిక్ హెడ్ (డ్యాన్స్) డాక్టర్ సుందర్‌సుధారమూర్తి, అకడమిక్ హెడ్ (ఆర్ట్) డాక్టర్ ఏజడ్.రంజిత్ తదితరులు పాల్గొన్నారు.