Governor: కళలు, సంస్కృతిని పరిరక్షించాలి
ABN , First Publish Date - 2022-12-31T07:53:26+05:30 IST
భారతీయ కళలు, సంస్కృతిని పరిరక్షించాలని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్
- గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్
- అలరించిన ‘భారత సమర్పణ’ నృత్యరీతులు
అడయార్(చెన్నై), డిసెంబరు 30: భారతీయ కళలు, సంస్కృతిని పరిరక్షించాలని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్(Governor Dr. Tamilisai Soundarrajan) పిలుపునిచ్చారు. భారత కళా అకాడమీ, అమెరికాకు చెందిన నో యువర్ రూట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘భారత సమర్పణ’ పేరు తో వివిధ భరతనాట్య నృత్యరీతులను ప్రదర్శించారు. టి.నగర్ రామకృష్ణ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాల ప్రాంగణంలోని ఇన్ఫోసిస్ హాలులో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో గవర్నర్ తమిళిసైతో పాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.రామ్మోహన రావు, మాజీ ఐఏఎస్ అధికారి రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ... భారత సమర్పణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన దేశ కళలు, నృత్యరీతులను విదేశాల్లో అభ్యసించడమే కాకుండా, ఇక్కడి వారికంటే అంద్భుతంగా ప్రదర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విశ్వగురువు స్వామి వివేకానంద విదేశాలకు వెళ్ళి వచ్చాక తన మాతృదేశానికి వందనం చేస్తున్నానంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. భారత సమర్పణ పేరుతో చిదంబరం, మదురై, తంజావూరు, చెన్నైలో భరత నాట్య నృత్యరీతులు ప్రదర్శించారని, వీరి చివరి ప్రదర్శన వారణాసిలో ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో భారత సమర్పణ నిర్వాహకులు వాణి గుండ్లపల్లి, ప్రొగ్రామ్ డైరెక్టర్ పూర్ణ పుష్పకళ నిర్వహణలో అమెరికాలో శిక్షణ పొందిన 40 మంది కళాకారులు ప్రదర్శించారు.