ఘంటసాల శతాబ్ది గాయకుడు
ABN , First Publish Date - 2022-12-05T04:14:43+05:30 IST
గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వర రావు ఒక ‘శతాబ్ది గాయకుడు’ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కేంద్ర పర్యాటక,
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
ఘనంగా శతజయంతి వేడుకలు
చెన్నై, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వర రావు ఒక ‘శతాబ్ది గాయకుడు’ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, కళాప్రదర్శిని ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఘంటసాల శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వెంకయ్య ప్రసంగిస్తూ.. తరాలు మారినా ఘంటసాల స్వరం మాత్రం ఎన్నటికీ మారదన్నారు. ఆయన సంగీతాన్ని తరతరాల వారు ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. ఒక గాయకుడిగా, రెండు తరాలకు తన గాత్రాన్ని అందించారని చెప్పారు. తన స్వర విన్యాసంతో ఇంత మంచి అభిమానాన్ని సంపాదించుకున్న ఘంటసాలను ‘‘శతాబ్ది గాయకుడు’’ (మ్యూజీషియన్ ఆఫ్ ది సెంచరీ) అని చెప్పడంతో సందేహంలేదని పేర్కొన్నారు. సాధారణ వ్యక్తిగా జీవితాన్ని మొదలుపెట్టి గాయకుడిగానే కాకుండా, స్వాతంత్య్ర సమరయోధుడుగా, సంగీత దర్శకుడిగా అనేక పార్శ్వాల్లో చిరస్మరణీయంగా నిలిచిన ఘంటసాల జీవితం యువతకు ఎంతో ఆదర్శనీయమైనదని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ సందర్భంగా, ప్రొఫెసర్ సుధారాణి రఘుపతి, ఎల్.ఆర్.ఈశ్వరి, నందిని రమణి, అవసరాల కన్యాకుమారి, తోట తరణి, డ్రమ్స్ శివమణి, దయాన్బన్‌లకు ‘కళా ప్రదర్శిని ఘంటసాల’ పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాలన్నీ ‘కలైమామణి’ పార్వతి రవి ఘంటసాల పర్యవేక్షణలో నిర్వహించారు.