అమ్మా.. క్షమించండి

ABN , First Publish Date - 2022-09-30T06:43:10+05:30 IST

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసు నుంచి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తప్పుకున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాజస్థాన్‌లో రాజకీయ పరిణామాలపై క్షమాపణ కోరారు

అమ్మా.. క్షమించండి

సోనియాకు గహ్లోత్‌ క్షమాపణలు

అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయబోను

రాజస్థాన్‌లో రాజకీయ పరిణామాలకు 

నైతిక బాధ్యత వహిస్తానని వెల్లడి

సీఎంగా కొనసాగాలా.. వద్దా..

అనేది సోనియా నిర్ణయిస్తారని వ్యాఖ్య

ఒకట్రెండు రోజుల్లో సోనియా నిర్ణయం

పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌

థరూర్‌ను ఇంటికెళ్లి కలిసిన దిగ్విజయ్‌ 

మాది స్నేహపూర్వక పోటీ: థరూర్‌

అధ్యక్ష ఎన్నికలో త్రిముఖ పోరు!

మూడో అభ్యర్థిగా ముకుల్‌ వాస్నిక్‌?


న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసు నుంచి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తప్పుకున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాజస్థాన్‌లో రాజకీయ పరిణామాలపై క్షమాపణ కోరారు. సీఎంగా తాను కొనసాగాలా? వద్దా? అనే విషయాన్ని సోనియా తేలుస్తారని చెప్పారు. గహ్లోత్‌ వైదొలగడంతో సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, శశి థరూర్‌ పోటీపడే విషయం స్పష్టమైనప్పటికీ మూడో అభ్యర్థిగా మహారాష్ట్రకు చెందిన ముకుల్‌ వాస్నిక్‌ రంగంలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్నిక్‌కు అధిష్ఠానం ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్‌కు స్వాతంత్ర్యానంతరం తొలి ద ళిత అధ్యక్షుడు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ తీరుతెన్నులపై అసమ్మతి వ్యక్తం చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో వాస్నిక్‌ ఒకరు. గహ్లోత్‌ పోటీ నుంచి తప్పుకున్న తర్వాత అధిష్ఠానం దృష్టి వాస్నిక్‌ పైకి మళ్లింది.


వాస్నిక్‌ నియామకంతో పార్టీ చైతన్యవంతమవుతుందని, పార్టీలో అవసరమైన మార్పులు జరుగుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వాస్నిక్‌ గురువారం పార్టీ నేతలు ఏకే ఆంటోనీ, గహ్లోత్‌ను కలుసుకున్నారు. ఇదిలా ఉండగా, గురువారం ఢిల్లీ వచ్చిన గహ్లోత్‌ సోనియా గాంధీని కలుసుకున్నారు. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పర్చినందుకు క్షమాపణలు చెప్పారు. అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేయబోనని ప్రకటించారు. రాజస్థాన్‌లో రాజకీయ పరిణామాలకు తాను నైతిక బాధ్యత వహిస్తానని చెప్పారు.


గత ఆదివారం జైపూర్‌ వచ్చిన కాంగ్రెస్‌ జాతీయ పరిశీలకులు మల్లిఖార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌లను తన వర్గం ఎమ్మెల్యేలు ధిక్కరించి సమాంతరంగా సమావేశాలు నిర్వహించినందుకు తాను సోనియాకు క్షమాపణ చెప్పానని తెలిపారు. తాను సీఎంగా కొనసాగాలా లేదా అనే విషయంపై సోనియా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. గహ్లోత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన పక్షంలో సీఎం సచిన్‌ పైలట్‌ను ఎంపిక చేస్తే ససేమిరా ఒప్పుకోమంటూ 82 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించడం తెలిసిందే. దీనిలో గహ్లోత్‌ ప్రమేయం లేదని పార్టీ పరిశీలకులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్లు వేసేందుకు శుక్రవారం చివరి రోజు. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌లు ఇద్దరూ శుక్రవారమే తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తాను పోటీ చేయబోతున్నానని ప్రకటించిన దిగ్విజయ్‌ శశిథరూర్‌ను ఆయన ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. ఇది ఇద్దరు ప్రత్యర్థుల మధ్య యుద్ధం కాదని, సహచరుల మధ్య స్నేహపూర్వక పోటీ మాత్రమేనని శశిథరూర్‌ ప్రకటించారు. దిగ్విజయ్‌ గురువారం పార్టీ రిటర్నింగ్‌ అధికారి మధుసూదన్‌ మిస్త్రీ నుంచి నామినేషన్‌ పత్రాలు తీసుకున్నారు. శశిథరూర్‌ శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. తాను 11 నుంచి 3 గంటల మధ్య నామినేషన్‌ వేస్తానని దిగ్విజయ్‌ చెప్పారు.

Read more