ప్రతి రాష్ట్రానికి 20లక్షల చొప్పున నిధులు

ABN , First Publish Date - 2022-02-19T09:22:40+05:30 IST

కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న చదువులను గాడిలో పెట్టేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. గడచిన రెండేళ్లలో వివిధ తరగతుల నుంచి డ్రాపవుట్‌ అయిన విద్యార్థుల వివరాలను సేకరించాలని అ....

ప్రతి రాష్ట్రానికి 20లక్షల చొప్పున నిధులు

 కొవిడ్‌తో దెబ్బతిన్న చదువులు గాడిలో పెట్టేందుకు కేంద్రం రోడ్‌మ్యాప్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న చదువులను గాడిలో పెట్టేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. గడచిన రెండేళ్లలో వివిధ తరగతుల నుంచి డ్రాపవుట్‌ అయిన విద్యార్థుల వివరాలను సేకరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. వచ్చే ఏప్రిల్‌లోగా ఈ పని పూర్తవ్వాలని పేర్కొంది. ఈ కసరత్తు ద్వారా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తారు. ఈ విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడానికి అవసరమైన రోడ్‌మ్యా్‌పను కేంద్రం రూపొందించింది. దీన్ని ఫిబ్రవరి మొదటివారంలో రాష్ట్రాలకు పంపించింది. ఈ మేరకు రోడ్‌మ్యా్‌పలోని అంశాలపై ఆన్‌లైన్‌ వార్తాసంస్థ ‘ది ప్రింట్‌’ కథనం ప్రచురించింది. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యలను రోడ్‌మ్యా ప్‌లో కేంద్రం పేర్కొంది. దీని ప్రకారం... డ్రాపవుట్‌ అయిన విద్యార్థుల్లోని రీడింగ్‌ స్కిల్స్‌ను మార్చి- ఏప్రిల్‌లో అంచనావేస్తారు. 3వ తరగతి విద్యార్థులను దీనికోసం సర్వేచేస్తారు. ఆ తరగతిలో ఉండాల్సిన సామర్థ్యాలు పిల్లల్లో ఉన్నాయో లేవో పరిశీలిస్తారు. ఇంతవరకు స్కూళ్లలో నమోదుకాని విద్యార్థులను, డ్రాపవుట్‌ అయినవారిని గుర్తిస్తారు. దీనికోసం ఒక్కో రాష్ట్రానికి రూ.20లక్షల చొప్పున నిధులను కేంద్రం ఇవ్వనుంది. తర్వాత దశలో... ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లను కలిపి క్లస్టర్లు ఏర్పాటుచేస్తారు. అలాగే అన్ని స్కూళ్లలో ప్రతి నెలా పేరెంట్‌ - టీచర్‌ మీటింగ్‌ నిర్వహించాలి. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక లెర్నింగ్‌ ప్యాకేజీని ప్రకటించింది. విద్యార్థులకు అవసరమైన వర్క్‌షీట్లు, స్టోరీ బుక్స్‌, సప్లిమెంటరీ లెర్నింగ్‌ మెటీరియల్‌ ఉచితంగా అందించనుంది. అప్పర్‌ ప్రైమరీ, సెకండరీ స్కూల్‌ స్థాయిలో ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున ఆర్థిక సహాయం కూడా చేయనున్నట్టు రోడ్‌మ్యాప్‌లో పేర్కొంది.

Read more