ఉచితాలు అనుచితాలే
ABN , First Publish Date - 2022-08-12T09:34:22+05:30 IST
ఖజానాపై పడే ఆర్థిక భారానికి, ప్రజా సంక్షేమానికి మఽధ్య సమతౌల్యం పాటించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ అభిప్రాయపడ్డారు.

సంక్షేమం, ఆర్థిక భారం మధ్య సమతౌల్యం పాటించాలి.. పార్టీల ఉచిత హామీలు తీవ్రమైన విషయం
అదేసమయంలో పేదరికాన్నీ విస్మరించలేం
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఖజానాపై పడే ఆర్థిక భారానికి, ప్రజా సంక్షేమానికి మఽధ్య సమతౌల్యం పాటించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ అభిప్రాయపడ్డారు. అయితే ఉచితాలను పంచిపెట్టే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలన్న ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు అప్రజాస్వామికమని జస్టిస్ రమణ గురువారం.. న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వేసిన పిటిషన్ విచారణ సందర్బంగా స్పష్టం చేశారు. అయితే ఉచితాలను హామీ ఇవ్వడం అనేది చాలా తీవ్రమైన విషయమని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ భారీ ఎత్తున ధనాన్ని కోల్పోతున్నదని జస్టిస్ రమణ, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఎంత మేర నష్టపోతున్నదనేది అధ్యయనం జరగాలని అభిప్రాయపడింది. మొత్తం వ్యవహారంలో కోర్టు ఏమి చేయగలదన్నదే ప్రశ్న అని వ్యాఖ్యానించింది.
ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ అని, దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయని, వారంతా వివేకంగా యోచించాలని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు, దేశంలో ఆర్థిక క్రమశిక్షణ అవసరమని, అదే సమయంలో పేదరికం కూడా తీవ్రంగా ఉన్నదని, కనుక సమస్యను విస్మరించలేమని ఆయన చెప్పారు. ఉచితాలపై రాజకీయ పార్టీలనుంచి సలహాలను ఆహ్వానిస్తూ ఆయన కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేశారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించగా, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఎన్నికల సంఘం తరఫున మణిందర్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఏఎమ్ సింఘ్వీ విచారణకు హాజరయ్యారు. కాగా ఉచితాలపై పరిశీలించి సిఫారసులు చేసేందుకు కమిటీని వేయాలని ఈ నెల 3న సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనను ఎన్నికల కమిషన్ అంగీకరించింది. అయితే ఈ కమిటీలో ఎన్నికల కమిషన్ భాగస్వామి కాబోదని, వివిధ మంత్రిత్వ శాఖ సభ్యులు ఉండే ఈ కమిటీలో ఒక రాజ్యాంగ సంస్థ పాలు పంచుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్నికల కమిషన్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా కమిషన్ తన అఫిడవిట్లో తప్పుపట్టింది. ఈసీ యే కనుక చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు బాధించాయంది. కాగా, కోర్టు చట్టాలు చేయలేదని, అది చట్టసభల బాధ్యత అని జస్టిస్ రమణ అన్నారు.
చట్టసభల పరిధిలోకి తాము ప్రవేశించలేమన్నారు. ఎన్నికల కమిషన్ అఫిడవిట్ తమకు సమర్పించకముందే మీడియాలో రావడాన్ని ప్రధాన న్యాయమూర్తి తప్పుపట్టారు, పార్టీలు వాగ్దానాలు చేసేటప్పుడు ఆర్థిక బడ్జెట్‌ను ప్రజల ముందుంచాలన్న సూచనను కూడా ఆయన తిరస్కరించారు. వారు అధికారంలోకి రాకముందే బడ్జెట్ ఎలా తయారు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కాగా, ఉచితాలపై కేంద్రం తీరును విమర్శిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎంపీలకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నప్పు డు ప్రజలకు ఇవ్వడంలో తప్పేంటని కేజ్రీ నిలదీశారు. ఆయన విమర్శలపై.. ఉచితాలపై రాష్ట్రాల హామీలకు సంబంధించి చర్చకు సిద్ధమని నిర్మల ప్రకటించారు.
సమాజానికి ఏం చెబుతాం?
ప్రభుత్వ విధానాల్లో ద్వంద్వ వైఖరిని పరోక్షంగా జస్టిస్ రమణ ప్రస్తావించారు. ‘‘చట్టాన్ని ఉల్లంఘించకూడదనే ఉద్దేశంతో ఒక ఇటుక కూడా నేను అదనంగా పేర్చను. కానీ నా పక్కనే ఉన్న అనేకమంది అక్రమంగా అంతస్థులు కట్టుకుపోతుంటారు. అలాంటప్పుడు సమాజానికి మనం ఏం సందేశం ఇస్తాం?’’ అని జస్టిస్ రమణ ప్రశ్నించారు.