ISIS Threat Letter : ఉత్తర ప్రదేశ్‌లో నాలుగు కుటుంబాలకు బెదిరింపు లేఖలు

ABN , First Publish Date - 2022-07-23T21:22:53+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని నాలుగు రైతు కుటుంబాలకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్

ISIS Threat Letter : ఉత్తర ప్రదేశ్‌లో నాలుగు కుటుంబాలకు బెదిరింపు లేఖలు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని నాలుగు రైతు కుటుంబాలకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్-ISIS) నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. సరీన్ గ్యాస్ దాడి చేస్తామని, 2024లో అతి పెద్ద కుట్ర జరుగుతుందని వీరిని హెచ్చరించారు. తమ సంస్థకు చెందిన మ్యాప్, పెన్ డ్రైవ్ తిరిగి ఇవ్వకపోతే కుటుంబ సభ్యులందరినీ చంపుతామని హెచ్చరించారు. 


రామ్‌పూర్, షాబాద్ తహశీలులోని అన్వ గ్రామంలో ఈ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ లేఖలు గురువారం వీరికి చేరాయి. దీంతో వీరంతా భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐసిస్ డిమాండ్ చేస్తున్న వస్తువుల గురించి తమకు తెలియదని వీరు చెప్పారు. 


పోలీసులు ఈ కేసును ఇంటెలిజెన్స్ బ్యూరో, తదితర ఏజెన్సీలకు అప్పగించారు. ఈ ఏజెన్సీలు ఓ రిపోర్టును దాఖలు చేసిన తర్వాత తాము ఎఫ్ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక)ను నమోదు చేస్తామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ సంసార్ సింగ్ తెలిపారు. ఈ కుటుంబాల్లోని సభ్యులు సాధారణ మధ్య తరగతి రైతులని, వీరికి సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలలో పని చేస్తున్నవారితో సంబంధాలు లేవని చెప్పారు. ఐసిస్ డిమాండ్ చేసిన మ్యాప్, పెన్ డ్రైవ్ గురించి వీరికి తెలియదన్నారు. ఇది ఉత్తుత్తి బెదిరింపా? నిజంగా హానికరమైన హెచ్చరికా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


పోలీసు శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ లేఖను బాగా చదువుకున్న వ్యక్తి రాసినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలేవీ లేవు. వీరి ఇళ్ళల్లో ఈ లేఖలను పడేస్తుండగా ఎవరూ గమనించలేదు. దర్యాప్తు కోసం స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. 


Updated Date - 2022-07-23T21:22:53+05:30 IST