Four days: మరో నాలుగు రోజులు వర్షాలు

ABN , First Publish Date - 2022-08-23T13:09:48+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ గాలుల దిశలో మార్పు

Four days: మరో నాలుగు రోజులు వర్షాలు

- ఆదివారం రాత్రి కుండపోత

- కేకే నగర్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం

- విమాన రాకపోకలకు అంతరాయం


అడయార్‌(చెన్నై), ఆగస్టు 22: రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ గాలుల దిశలో మార్పు చోటు చేసుకోవడంతో మంగళవారం నుంచి 25 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం పడుతుందని ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాలతో పాటు కొండ ప్రాంతాలైన నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు, దిండిగల్‌, తేని(Nilgiris, Coimbatore, Tiruppur, Dindigul, Theni) జిల్లాల్లో ఈ నెల 25వ తేదీ వరకు భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. తెన్‌కాశి, తిరునెల్వేలి, కన్నియాకుమారి ప్రాంతా ల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షం కురవచ్చని వెల్లడించింది. చెన్నై నగరంలో రానున్న 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించిన వాతావరణ శాఖ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుతో మోస్తరు వర్షం కురిసే అవకాశం ముందని ప్రకటించింది. కోస్తా తీర ప్రాంతమైన కుమరి సముద్రతీరం, గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌, సౌత్‌వెస్ట్రన్‌ బంగాళాఖాతం ప్రాంతాల్లో నేడు రేపు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అందువల్ల జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరించింది. 


తడిసి ముద్దయిన నగరం

ఆదివారం రాత్రి ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షానికి చెన్నై నగరం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సైదాపేట, కోట్టూరుపురం, గ్రీన్‌వేస్ రోడ్డు, కేకే నగర్‌, అశోక్‌ నగర్‌, జాఫర్‌ఖాన్‌ పేట, గిండి, కోడంబాక్కం, వడపళని, సాలిగ్రామం, పెరంబూరు, అన్నానగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 8 నుంచి పది గంటల వరకు కురిసిన వర్షానికి అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అన్నాశాలై, ఎల్బీ రోడ్డు, ఎస్పీ రోడ్డు, వందడుగుల రోడ్డు, మెరీనా బీచ్‌ రోడ్డు, రాయపురం మెయిన్‌ రోడ్డు, రాయపేట ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో ఆ మర్గంలో వచ్చిన వారు ఇబ్బంది పడ్డారు.


ల్యాండింగ్‌కు అవకాశం లేక..

చెన్నై సహా పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దీని కారణంగా చెన్నై నుంచి 20కి పైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరు విమానాలు ల్యాండ్‌ కాలేక వెనక్కిమళ్లాయి. మదురై, బెంగుళూరు, హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, తిరుచ్చి, కోల్‌కత నుంచి చెన్నై వచ్చిన విమానాలను వెనక్కి తిప్పి పంపించారు. రాత్రి 10 గంటల తరువాత వచ్చిన విమానాలకు మాత్రం చెన్నై ఎయిర్‌పోర్టు(Chennai Airport)లో ల్యాండ్‌ అయ్యేందుకు ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారులు అనుమతిచ్చారు. అదేవిధంగా చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌, బహ్రెయిన్‌, తిరుచ్చి, హైదరాబాద్‌, కోల్‌కత తదితర ప్రాంతాలకు వెళ్ళాల్సిన విమానాలు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాయి. రాత్రి 10.30 గంటల తర్వాత వర్షం పూర్తిగా ఆగిన తర్వాత వెనక్కి పంపిన ఆరు విమానాలను తిరిగి చెన్నైలో ల్యాండ్‌ అయ్యేందుకు అనుమతిచ్చారు. 


అధిక వర్షపాతం నమోదు 

స్థానిక కేకే నగర్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం దెబ్బకు ఈ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే కేకే నగరులో రికార్డు స్థాయిలో ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే అన్నాసాలై, ఎగ్మోర్‌, రాయపేట, కోయంబేడు, వడపళని, అశోక్‌ నగర్‌, పెరంబూరు, కొడుంగయూరు, బీసెంట్‌ నగర్‌, అడయారు, తిరువేర్కాడు, తిరుముళ్ళైవాయల్‌, మాధవరం, రెడ్‌హిల్స్‌, వండలూరు, ఊరపాక్కం తదితర ప్రాంతాల్లో  భారీవర్షం కురిసింది. తరమణిలో రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు 3.7 సెంటీమీటర్ల వర్షపాతం, మిగిలిన  ప్రాంతాలో ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 


పెరిగిన చెంబరంబాక్కం నీటిమట్టం

ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి  చెన్నై నగరవాసుల దాహార్తి తీర్చే జలాశయం చెంబరంబాక్కం చెరువులో నీరు పెరిగింది. ప్రస్తుతం చెరువులోకి 609 ఘటనపుటడుగుల నీరు వస్తోంది. మొత్తం 3645 మిలియన్‌ ఘనపుటడుగుల సామర్థ్యం ఉన్నన ఈ చెరువులో ఆదివారం రాత్రి కురిసిన  వర్షానికి ఒకేసారి 39 మిలియన్‌ ఘనపుటడుగుల నీరు వచ్చిచేరింది. 

Read more