కేంద్ర మాజీ మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌పై రేప్‌ కేసుకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-08-19T06:02:06+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు షానవాజ్‌ హుస్సేన్‌పై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే

కేంద్ర మాజీ మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌పై రేప్‌ కేసుకు రంగం సిద్ధం

న్యూఢిల్లీ, ఆగస్టు 18: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు షానవాజ్‌  హుస్సేన్‌పై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి గురువారం సుప్రీంకోర్టు నిరాకరించింది. దాంతో ఆయనపై కేసు పెట్టడానికి రంగం సిద్ధమవుతోంది. తనపై అత్యాచారం చేశారంటూ నాలుగేళ్ల క్రితం ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు పోలీసులను సూచించింది. కేసు పెట్టేందుకు పోలీసులు పూర్తిగా విముఖత చూపించారని ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆశా మీనన్‌ వ్యాఖ్యానించారు. దీనిపై షానవాజ్‌ హుస్సేన్‌ సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం పరిశీలించింది. 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారని, కేసు పెడితే ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని  షానవాజ్‌ తరఫు న్యాయవాది వాదించారు.


స్టే ఇవ్వడానికి నిరాకరించిన ధర్మాసనం ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు షానవాజ్‌పై కేసు నమోదు చేయాలని 2018 జులై 7న స్థానిక మేజిస్ట్రేటు కోర్టు ఆదేశించింది. దీనిపై ఆయన సెషన్స్‌ కోర్టులో అప్పీలు చేయగా అక్కడ తిరస్కరణకు గురయింది. అనంతరం హైకోర్టుకు వెళ్లగా కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అయితే ట్రయల్‌ కోర్టు విచారణపై తాత్కాలిక స్టే విధిస్తూ 2018 జులై 13న ఆదేశాలు ఇచ్చింది. కేసు నమోదు విషయమై షానవాజ్‌ మళ్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పోలీసుల దర్యాప్తులో తేలినందున కేసు నమోదు అవసరం లేదని తెలిపారు.  

Updated Date - 2022-08-19T06:02:06+05:30 IST