రగిలిన సరిహద్దు

ABN , First Publish Date - 2022-12-07T04:15:53+05:30 IST

కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం విధ్వంసం రూపు తీసుకుంది. రెండు రాష్ర్టాల్లోనూ మంగళవారం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

రగిలిన సరిహద్దు

కర్ణాటక, మహారాష్ట్రల్లో వాహనాలపై రాళ్ల దాడులు

మహారాష్ట్ర మంత్రుల బృందం పర్యటన వాయిదా

పరిస్థితి ఆందోళనకరంగా మారింది: శరద్‌ పవార్‌

బెంగళూరు, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం విధ్వంసం రూపు తీసుకుంది. రెండు రాష్ర్టాల్లోనూ మంగళవారం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్ర లారీలపై కర్ణాటకలో రాళ్ల దాడి జరుగడంతో వందలాదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కర్ణాటక బస్సులపై మహారాష్ట్రలో ఆందోళనకారులు నలుపు, ఆరెంజ్‌ రంగులు స్ర్పే చేశారు. గ్రాఫిటీ ఆర్ట్‌ ద్వారా జై మహారాష్ట్ర నినాదాలను కూడా కర్ణాటక బస్సులపై రాశారు. ఈ నేపథ్యంలో మంత్రుల నేతృత్వంలోని మహారాష్ట్ర హైపవర్‌ కమిటీ మంగళవారం చేపట్టదలచిన బెళగావి పర్యటన వాయిదా పడింది. సరిహద్దులో అశాంతిని సృష్టించేందుకు వస్తున్న మహారాష్ట్ర మంత్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని అంతకుముందు కరవే అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ ప్రకటించారు. దారవాడ తదితర ప్రాంతాల నుంచి వందలాది వాహనాలలో కరవే కార్యకర్తలు బెళగావికి చేరుకున్నారు. మరోవైపు పుణేలో కర్ణాటక ఆర్టీసీ బస్సులపై శివసేన కార్యకర్తలు నలుపు, ఆరెంజ్‌ రంగులను స్ర్పే చేశారు. బుధవారం నుంచి కర్ణాటక వ్యాప్తంగా నిరసనలకు కరవే పిలుపునిచ్చింది. కాగా, తమ గ్రామాల్లో కనీస వసతులు కల్పిస్తారా? లేక తమ గ్రామాలను కర్ణాటకలో కలిపేసేందుకు అనుమతిస్తారా? అని మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా అక్కల్‌కోట్‌ తహసిల్‌లోని 11 గ్రామాలు అల్టిమేటం జారీ చేశాయి.

బొమ్మైకి ఫడణవీస్‌ ఫోన్‌..నిందితులపై చర్యలకు విజ్ఞప్తి

ఆందోళనలు హింసాత్మకంగా మారిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైకి ఫోన్‌ చేసి మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు రాష్ర్టాల మధ్య సరిహద్దు పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. ‘మహారాష్ట్ర సహనానికి ఒక పరిమితి ఉంటుంది. 24 గంటల్లోగా వాహనాలపై దాడులు ఆగకుంటే జరిగే పరిణామాలకు కర్ణాటక ముఖ్యమంత్రి, కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని తేల్చిచెప్పారు.

Updated Date - 2022-12-07T04:15:54+05:30 IST