SpiceJet: విమానంలో ప్రయాణం చేసిన 50 మందికి చేదు అనుభవం.. అసలు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-07-17T01:12:06+05:30 IST

విమానంలో ప్రయాణం చేస్తున్న మీరు మాత్రమే గమ్య స్థానానికి చేరుకుని, మీ లగేజ్ మాయమైతే ఎలా ఉంటుంది..? దుబాయ్ నుంచి పుణెకు చేరుకున్న..

SpiceJet: విమానంలో ప్రయాణం చేసిన 50 మందికి చేదు అనుభవం.. అసలు ఏమైందంటే..

పుణె: విమానంలో ప్రయాణం చేస్తున్న మీరు మాత్రమే గమ్య స్థానానికి చేరుకుని, మీ లగేజ్ మాయమైతే ఎలా ఉంటుంది..? దుబాయ్ నుంచి పుణెకు చేరుకున్న దాదాపు 50 మందికి పైగా ప్రయాణికులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. గురువారం నాడు SpiceJet SG52 విమానం ఉదయం ఆరు గంటలకు దుబాయ్ నుంచి పుణెకు చేరుకుంది. ప్రయాణికులంతా విమానం దిగి లగేజ్ కోసం చూడగా.. 50 మందికి పైగా ప్రయాణికుల లగేజీ కనిపించలేదు. దీంతో ఆ ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ల లగేజీ ఎక్కడ ఉందనే విషయంపై కూడా ఆ ప్రయాణికులు సమాచారం అందలేదు. దీంతో.. ప్రయాణికులు సదరు ఎయిర్‌లైన్స్ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ ప్రయాణికుల్లో ఒకరు మాట్లాడుతూ.. తన లగేజీ గురించిన సమాచారం కోసం శుక్రవారం సాయంత్రం వరకూ ఎదురుచూశామని, ఎయిర్‌లైన్స్ నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపింది. ఆ యువతి అన్నయ్య మాట్లాడుతూ.. తనను చూసేందుకు దుబాయ్ నుంచి తన చెల్లి ఈ విమానంలో వచ్చిందని చెప్పాడు. గురువారం ఉదయం 6 గంటలకు విమానం ల్యాండ్ అయితే.. ఇప్పటికీ తన చెల్లి లగేజీ ఆమెకు అందలేదని తెలిపాడు. ఇక చేసేదేమీ లేక తన భార్య దుస్తులను చెల్లి ధరించిందని చెప్పాడు. శనివారం సాయంత్రం తన చెల్లి తిరిగి దుబాయ్ వెళ్లాల్సి ఉందని.. కానీ.. తన లగేజీ ఇంతవరకూ ఆమెకు చేరలేదని తెలిపాడు. హెల్ప్ లైన్‌కు తరచుగా కాల్ చేసినప్పటికీ స్పందించలేదని, Unknown Number నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేసి ఆ లగేజీని తీసుకొచ్చే పనిలో ఉన్నామని చెప్పినట్లు అతను చెప్పాడు. ఇది ఒక ప్రయాణికురాలికి ఎదురైన చేదు అనుభవం మాత్రమే.మిగిలిన ప్రయాణికుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ లగేజీ అందని వారిలో వ్యాపార కార్యకలాపాల నిమిత్తం పుణెకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు. వాళ్లంతా వేరే దారి లేక కొత్త దుస్తులు కొనుగోలు చేసిన పరిస్థితి. ఈ ఘటనపై స్పైస్‌జెట్ ప్రతినిధి స్పందిస్తూ.. దాదాపు చాలామంది బ్యాగ్స్ శుక్రవారం ఉదయం ఫ్లైట్‌లో వచ్చాయని, మిగిలిన ఏడుగురు ప్రయాణికుల లగేజీ ఉదయం ఫ్లైట్‌లో వస్తాయని చెప్పడం గమనార్హం. సాధారణంగా ప్రతికూల పరిస్థితుల్లో విమానం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు కొంత బరువును తగ్గించడం ద్వారా దానిని ఇంధనంతో భర్తీ చేస్తారు. అందువల్ల వారికి లగేజీలను వదిలి వాటిని తర్వాతి విమానంలో పంపిస్తుంటారు. తాజాగా, ఈ విమానానికి కూడా అదే సమస్య ఎదురుకావడంతో ప్రయాణికుల లగేజీని కుదించారు.

Read more