Fevers: జ్వరాలపై యుద్ధం!

ABN , First Publish Date - 2022-09-21T15:11:05+05:30 IST

రాజధాని నగరం చెన్నైలో పిల్లలు, వృద్ధులు అధికంగా జ్వరం బారిన పడుతుండడంతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో ఎగ్మూర్‌

Fevers: జ్వరాలపై యుద్ధం!

- నేడు రాష్ట్రవ్యాప్తంగా 1,000 ప్రత్యేక శిబిరాలు

- ఎగ్మూర్‌ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 20: రాజధాని నగరం చెన్నైలో పిల్లలు, వృద్ధులు అధికంగా జ్వరం బారిన పడుతుండడంతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో ఎగ్మూర్‌ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటుచేశారు. వర్షాకాలంలో సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో సాధారణ, వైరల్‌ జ్వరాలు ప్రబలుతుంటాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు, హఠాత్తుగా వర్షాలు కురుస్తుండడంతో వైరల్‌ జ్వరాల వ్యాప్తి అధికమైంది. పిల్లల నుంచి పెద్దల వరకు జ్వరం లక్షణాలు కనిపిస్తుండగా, పిల్లలు, వృద్ధుల్లో జ్వర తీవ్రత అధికంగా ఉంది. సాధారణ జ్వరం మూడు రోజుల్లో తగ్గుతుండగా, ప్రస్తుతం విజృంభిస్తున్న వైరల్‌ జ్వరం(Viral fever) తగ్గేందుకు 5 నుంచి వారం రోజులు పడుతోంది. జ్వరం లక్షణాలు తగ్గినా మరో మూడు రోజుల వరకు బాధితులకు ఒళ్లునొప్పులు ఉంటున్నాయి. ప్రస్తుతం వైరల్‌ జ్వరం బాధితులు మూడు రోజుల్లో కోలుకోని పక్షంలో వారికి రక్తపరీక్షలు నిర్వహించి డెంగ్యూ జ్వరమా, ఫ్లూ వైర్‌సగా నిర్ధారిస్తున్నారు. చెన్నైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జ్వరం బాధితుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. దీంతో, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు జ్వర బాధితులతో కిక్కిరిసి పోతున్నాయి.


పిల్లల ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు...

ఈ జ్వరానికి పిల్లలు అధికంగా లోనవుతుండడంతో ఎగ్మూర్‌(Egmoor) ప్రభుత్వ చిన్నారుల సంక్షేమ ఆస్పత్రి ప్రాంగణంలోని 8వ అంతస్తులో ప్రత్యేక వార్డు ఏర్పాటైంది. ఈ వార్డులో పిల్లలు అధికంగా చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.  వైరల్‌ జ్వరం మూడు రోజుల్లో తగ్గుతాయని,  జ్వరం అధికంగా ఉంటే రక్తపరీక్షలు చేయించుకోవాలని ఎగ్మూర్‌ పిల్లల ఆసుపత్రి డైరెక్టర్‌ డా.ఎళిలరసి తెలిపారు. రక్తపరీక్షల్లో డెంగ్యూ, ఫ్లూ అన్నది నిర్ధారణ అయితే అందుకు అనుగుణంగా చికిత్స అందించవచ్చని, రాష్ట్రంలో ఫ్లూ  వ్యాప్తి తక్కువగా ఉందని తెలిపారు.


నేడు ప్రత్యేక వైద్య శిబిరాలు...

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెయ్యి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. నగరంలో ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఫ్లూ జ్వరం బాధితుల సంఖ్య 1,166కు చేరిందన్నారు. బుధవారం ప్రత్యేక శిబిరాలతో పాటు సంచార వాహనాల ద్వారా వైద్యపరీక్షలు నిర్వహించనున్నామని, జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలున్న వారు ఈ శిబిరాలకు వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.

Read more