కర్ణాటకలో ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2022-10-17T08:53:10+05:30 IST

కర్ణాటక రాష్ట్రం హాసన్‌ జిల్లా అరసికెరె తాలూకా గాంధీనగర్‌ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు.

కర్ణాటకలో ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

బెంగళూరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం హాసన్‌ జిల్లా అరసికెరె తాలూకా గాంధీనగర్‌ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు. టెంపోలో విహార యాత్రకు వెళ్లి, తిరిగి వస్తుండగా.. గాంధీనగర్‌ సమీపాన పాల ట్యాంకర్‌ రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చి కేఎ్‌సఆర్టీసీ బస్సును ఢీకొంది. ఆ రెండింటి మధ్య వీరు ప్రయాణిస్తున్న వాహనం చిక్కుకుపోవడంతో ఎక్కువమంది చనిపోయారు. మృతుల్లో నలుగురు పిల్లలు.. ఐదుగురు పెద్దలున్నారు. దొడ్డనహళ్లికి చెందిన ధ్రువ (2), తన్మయ్‌ (10), సాలాపుర గ్రామానికి చెందిన లీలావతి (50), చైత్ర (33), సమర్థ్‌ (10), డింపి (12), వందన (20), దొడ్డయ్య (60), భారతి (50) ఈ ప్రమాదంలో మృతి చెందారు. వీరిలో దొడ్డయ్య, భారతి దంపతులు. దొడ్డయ్య సోదరుడు రమేశ్‌, అతడి భార్య లీలావతి, మనవళ్లు ధ్రువ, తన్మయ్‌, వాహనం నడుపుతున్న దొడ్డయ్య కుమారుడు శశికుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.


Updated Date - 2022-10-17T08:53:10+05:30 IST