December 06: 30 ఏళ్ళ క్రితం... సరిగ్గా ఇదే రోజు... నేటి పరిస్థితి ఇదీ...

ABN , First Publish Date - 2022-12-06T14:10:32+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని వివాదాస్పద బాబ్రీ మసీదును 1992 డిసెంబరు 6న వందలాది మంది కరసేవకులు కూల్చివేశారు. హిందూ,

December 06: 30 ఏళ్ళ క్రితం... సరిగ్గా ఇదే రోజు... నేటి పరిస్థితి ఇదీ...
Kar Sevaks on Babri Mosque

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని వివాదాస్పద బాబ్రీ మసీదును 1992 డిసెంబరు 6న వందలాది మంది కరసేవకులు కూల్చివేశారు. హిందూ, ముస్లిం వర్గాలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఈ స్థలాన్ని రామాలయం నిర్మాణం కోసం హిందువులకు అప్పగించాలని, మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు వేరొక చోట స్థలం కేటాయించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రస్తుతం రామాలయం నిర్మితమవుతోంది, 2024 నాటికి భక్తుల పూజలకు అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ సందర్భంగా బాబ్రీ మసీదు గురించి కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే...

బాబర్ ఆదేశాలతో...

మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాల మేరకు అయోధ్యలో రామ జన్మస్థలంలో ఉన్న రామాలయాన్ని కూల్చవేసి, 1528లో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగినట్లు నెలకొన్న వివాదం పలు చారిత్రాత్మక పరిణామాలకు దారి తీసింది. బాబ్రీ మసీదును శ్రీరాముని జన్మస్థలంలో నిర్మించారనే వాదన, నమ్మకం మధ్య 1859లో బ్రిటిష్ పాలకులు ఈ మసీదు చుట్టూ కంచెను ఏర్పాటు చేసి, వెలుపల పూజలు చేసుకోవడానికి హిందువులకు అనుమతి ఇచ్చారు. వెలుపల పూజలు చేసుకోవడం కోసం ఓ వేదికను నిర్మించుకుంటామని మహంత్ రఘుబీర్ దాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను స్థానిక కోర్టు 1885లో తిరస్కరించింది. అంతకుముందు ఇక్కడి హనుమాన్‌గఢి దేవాలయాన్ని ఓ మసీదు స్థలంలో నిర్మించారని సున్నీ ముస్లింలు ఆరోపించడంతో హిందూ-ముస్లింల మధ్య 1855లో ఘర్షణలు జరిగాయి.

డోమ్ పునర్నిర్మాణం

1934లో హిందూ-ముస్లింల మధ్య జరిగిన ఘర్షణల్లో ఈ మసీదు డోమ్ దెబ్బతింది. దీనిని పునర్నిర్మించేందుకు బ్రిటిష్ పాలకులు ముందుకు వచ్చారు. ఈ మసీదుపై అధికారం సున్నీ వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉందని, షియా వక్ఫ్ బోర్డుకు లేదని స్థానిక కోర్టు 1947లో రూలింగ్ ఇచ్చింది. ఈ మసీదులో హిందూ మహాసభ సభ్యులు పెట్టిన విగ్రహాలను తొలగించేందుకు ఆదేశించబోనని జిల్లా మేజిస్ట్రేట్ 1949 డిసెంబరు 22న తీర్పు చెప్పారు. ఆ తర్వాత ఈ మసీదుకు తాళాలు వేశారు.

పూజలకు తాత్కాలిక ఆదేశాలు

1950లో హిందూ, ముస్లింలు ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. తాము పూజలు, నమాజ్ చేసుకోవడానికి అనుమతించాలని కోరారు. గర్భగుడికి తాళాలు వేయాలని, ఓ పూజారి వెళ్లి, పూజలు చేయవచ్చునని, ఇతరులు వెళ్ళకూడదని తాత్కాలిక ఆదేశాలు వచ్చాయి. వివాదాస్పద స్థలంలో పూజలు చేసేందుకు అనుమతించాలని 1959లో నిర్మోహి అఖాడా ఇదే కోర్టులో ఓ దావా దాఖలు చేసింది. మసీదులో ప్రార్థనలకు అనుమతించాలని 1961లో యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఓ దావా వేసింది. ఈ స్థలాన్ని తమకు స్వాధీనం చేయాలని ఈ బోర్డు 1981లో పిటిషన్ వేసింది.

అద్వానీ నేతృత్వంలో...

బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ (Lal Krishna Adwani) నాయకత్వంలో రామ జన్మభూమి ఉద్యమం 1984లో ఊపందుకుంది. విశ్వహిందూ పరిషత్ (VHP) బిహార్ నుంచి ఢిల్లీకి శ్రీరామ్-జానకి రథయాత్రను నిర్వహించింది. ఉత్తర ప్రదేశ్‌లో ఇటువంటి ఆరు రథయాత్రలు జరిగాయి.

హిందువులకు అనుమతి

బాబ్రీ మసీదు తలుపులను తెరచి, పూజలు చేసుకోవడానికి హిందువులను అనుమతిస్తూ జిల్లా జడ్జి 1986లో తీర్పు చెప్పారు. దీంతో ముస్లింలు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని 1989లో ఆదేశించింది.

రాజీవ్ ప్రభుత్వం

రామాలయం కోసం శిలాన్యాసం చేయడానికి వీహెచ్‌పీకి 1989 నవంబరు 9న అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రామాలయానికి మద్దతు కూడగట్టడం కోసం 1990 సెప్టెంబరు 25న అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్‌కే అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్రను ప్రారంభించారు. అయోధ్యలోని బాబ్రీ మసీదుకు వెళ్లే మార్గంలో 1990 అక్టోబరు 30న కరసేవకులు - పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉత్తర ప్రదేశ్‌లో మత ఘర్షణలు చెలరేగాయి.

అకస్మాత్తుగా దూసుకెళ్లి...

1992 డిసెంబరు 6న అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి బీజేపీ, విశ్వహిందూ పరిషత్ నేతల ప్రసంగాలను వినడం కోసం బాబ్రీ మసీదు వద్దకు దాదాపు 1.5 లక్షల మంది హాజరయ్యారు. ఈ ప్రజలు అకస్మాత్తుగా మసీదులోకి దూసుకెళ్లారు. కొద్ది గంటల్లోనే దానిని కూల్చేశారు. అప్పట్లో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉండేది. మసీదుకు ఎటువంటి నష్టం జరగనివ్వబోమని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. అయినప్పటికీ కూల్చివేత జరిగిపోయింది. దీంతో చాలా ప్రాంతాల్లో మత ఘర్షణలు జరిగాయి. దేశవ్యాప్తంగా సుమారు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు లాల్ కృష్ణ అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషీ తదితరులపై కేసులు నమోదు చేశారు. అప్పుడు యూపీలో అధికారంలో ఉన్న కల్యాణ్ సింగ్ నేతృత్వకంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది.

పాకిస్థాన్‌లో...

1992 డిసెంబరు 8న పాకిస్థాన్‌లోని 30కిపైగా హిందూ దేవాలయాలపై అక్కడి ముస్లింలు దాడి చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా పాఠశాలలు, కార్యాలయాలను పాకిస్థాన్ ప్రభుత్వం ఒక రోజు మూసివేసింది.

లిబర్హాన్ కమిషన్‌

బాబ్రీ మసీదు కేసుపై దర్యాప్తు కోసం లిబర్హాన్ కమిషన్‌ను 1992 డిసెంబరు 16న అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయోధ్యలోని నిర్దిష్ట భూ సేకరణ చట్టం ప్రకారం బాబ్రీ మసీదు పరిసరాల్లోని 67.703 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం 1993లో సేకరించింది. క్రిమినల్ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. మసీదు కూల్చివేతకు రెచ్చగొట్టారని అద్వానీపైనా, మరో 19 మందిపైనా ఛార్జిషీట్ దాఖలు చేసింది.

కల్యాణ్ సింగ్‌కు జైలు శిక్ష

మసీదు కూల్చివేత సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కల్యాణ్ సింగ్‌ను అపరాధిగా సుప్రీంకోర్టు 1994లో నిర్థరించింది. ఆయనకు రూ.20,000 జరిమానా, ఒక రోజు జైలు శిక్ష విధించింది. అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషీ, బాల్ థాకరే తదితరులపై ఆరోపణలను 2001లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఉపసంహరించింది.

అయోధ్య సెల్

హిందూ-ముస్లిం నేతలతో చర్చలు జరిపేందుకు శతృఘ్న సింగ్ అనే ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో అయోధ్య సెల్‌ను 2002లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయి ఏర్పాటు చేశారు. అప్పట్లో జరిగిన ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల మేనిఫెస్టోలో రామాలయం నిర్మాణం అంశాన్ని బీజేపీ పొందుపరచలేదు. కానీ వీహెచ్‌పీ మాత్రం రామాలయం నిర్మాణం ప్రారంభానికి 2002 మార్చి 15ను గడువుగా ప్రకటించింది. ఇదిలావుండగా, బాబ్రీ మసీదు స్థలాన్ని తవ్వి, దాని క్రింద దేవాలయం ఉండేదా? లేదా? నిర్థరించాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను అలహాబాద్ హైకోర్టు అదే సంవత్సరం ఆదేశించింది.

ఏఎస్ఐ నివేదిక

ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2003లో సమర్పించిన నివేదికలో ఈ మసీదు క్రింద 10వ శతాబ్దంనాటి దేవాలయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపింది. మసీదు కూల్చివేతకు రెచ్చగొట్టినందుకు ఏడుగురు హిందూ నాయకులు విచారణను ఎదుర్కొనాలని సీబీఐ స్పెషల్ కోర్టు రూలింగ్ ఇచ్చింది. వీరిలో అద్వానీ లేరు. ఈ ఆదేశాలను సమీక్షించాలని కోర్టు 2004లో ఆదేశించింది. అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్‌పై ఆరుగురు అనుమానిత లష్కరే తొయిబా ఉగ్రవాదులు 2005లో దాడి చేశారు.

అద్వానీ తదితరులు నిందకు అర్హులే...

లిబర్హాన్ కమిషన్ 17 ఏళ్ళ పాటు దర్యాప్తు చేసిన తర్వాత తన నివేదికను 2009లో సమర్పించింది. అటల్ బిహారీ వాజ్‌పాయి, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కల్యాణ్ సింగ్, ప్రమోద్ మహాజన్, ఉమా భారతి, విజయరాజే సింథియా, వీహెచ్‌పీ నేతలు గిరిరాజ్ కిశోర్, అశోక్ సింఘాల్, శివ సేన చీఫ్ బాల్ థాకరే, ఆరెస్సెస్ మాజీ నేత కేఎన్ గోవిందాచార్య తదితరులు నిందకు అర్హులేనని తెలిపింది.

అలహాబాద్ హైకోర్టు రూలింగ్

2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌లో వివాదాస్పద బాబ్రీ మసీదు భూమిని మూడు భాగాలుగా విభజించాలని తెలిపింది. మూడింట రెండొంతుల భూమిని హిందూ పిటిషనర్లకు, మిగిలిన మూడింట ఒక వంతు భూమిని సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని తెలిపింది. దీనిపై హిందూ, ముస్లిం వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, అత్యున్నత న్యాయస్థానం 2011లో ఈ హైకోర్టు తీర్పును నిలిపివేసింది.

మోదీ ప్రభుత్వం

2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉండగా, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రామాలయాన్ని నిర్మించాలని కోరారు. అదే సంవత్సరంలో బాబ్రీ మసీదు లిటిగెంట్ మహమ్మద్ హషీం అన్సారీ (95) మరణించారు. 2017లో బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, జోషీ, ఉమా భారతి, ఇతర బీజేపీ నేతలు, కరసేవకులు విచారణను ఎదుర్కొనాలని సుప్రీంకోర్టు చెప్పింది. కల్యాణ్ సింగ్ రాజస్థాన్ గవర్నర్ పదవిని నిర్వహిస్తుండటంతో ఆయనను మినహాయించింది. మరోవైపు విచారణ జరుగుతున్న సమయంలోనే బాల్ థాకరే వంటివారు మరణించారు. లక్నోలో జరిగే విచారణ రెండేళ్ళలో పూర్తవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీజేపీ నేతలపై స్పెషల్ సీబీఐ కోర్టు ఆరోపణలను నమోదు చేసింది, బెయిలు కూడా మంజూరు చేసింది.

రాజ్యాంగ ధర్మాసనం

2018లో సుప్రీంకోర్టు సివిల్ అపీళ్ళపై విచారణ ప్రారంభించింది. ఈ కేసులో పార్టీలుగా చేరుతామని సుబ్రహ్మణ్యం స్వామి వంటివారు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. 2019లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. జస్టిస్ యూయూ లలిత్ ఈ కేసు విచారణ నుంచి వైదొలగారు. దీంతో జస్టిస్ గొగోయ్ నేతృత్వంలో బాబ్డే, చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ఏ నజీర్‌లతో మరొక ధర్మాసనం ఏర్పాటైంది.

కూల్చివేత కేసు విచారణను పూర్తి చేయడానికి మరో ఆరు నెలలు గడువు మంజూరు చేయాలని స్పెషల్ జడ్జి సుప్రీంకోర్టును కోరారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుండటంతో 2019 అక్టోబరు 14 నుంచి డిసెంబరు 10 వరకు సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నట్లు అయోధ్య జిల్లా యంత్రాంగం ప్రకటించింది.

ముస్లిం లిటిగెంట్ ప్రతిపాదన

2019 అక్టోబరు 16న ఆశ్చర్యకర పరిణామం జరిగింది. ఈ భూమి హక్కు కేసులో ప్రధాన ముస్లిం లిటిగెంట్ తన అపీలును ఉపసంహరించుకుంటానని సుప్రీంకోర్టుకు చెప్పారు. అయితే దేశంలోని ఇతర ప్రార్థనా స్థలాలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. ఇతర ముస్లిం పిటిషనర్లు ఈ ఆఫర్ నుంచి తప్పుకున్నారు.

2019 నవంబరు 8న సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆ మరుసటి రోజు (2019 నవంబరు 9న) ఉదయం 10.30 గంటలకు తీర్పువెలువడుతుందని తెలిపింది.

ఏకగ్రీవ తీర్పు

2019 నవంబరు 9న సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పును ప్రకటించింది. ఒకప్పుడు బాబ్రీ మసీదు ఉన్న స్థలాన్ని పూర్తిగా హిందువులకు ఇవ్వాలని తీర్పు చెప్పింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ స్థలంలో ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని ఆదేశించింది.

మసీదు కూల్చివేత కేసులో విచారణను పూర్తి చేయడానికి మూడు నెలల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు 2020 మే 8న ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 31నాటికి తీర్పు చెప్పాలని తెలిపింది. అయితే ఆగస్టులో ఈ గడువును మరో నెల పొడిగించింది.

రామాలయానికి భూమి పూజ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 2020 ఆగస్టు 5న రామాలయం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ప్రస్తుతం రామాలయం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 2024నాటికి భక్తుల పూజలకు అందుబాటులోకి వస్తుందని అంచనా.

అందరూ నిర్దోషులే

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో స్పెషల్ సీబీఐ కోర్టు తీర్పు 2020 సెప్టెంబరు 30న వెలువడింది. ఈ కేసులోని నిందితులంతా నిర్దోషులని తీర్పు చెప్పింది. దీంతో అద్వానీ, ఉమా భారతి, జోషీ, కల్యాణ్ సింగ్ తదితరులకు గొప్ప ఊరట లభించింది.

Updated Date - 2022-12-06T15:00:07+05:30 IST