Aam Aadmi Party : ఆప్ గుజరాత్ సీఎం అభ్యర్థిగా మాజీ టీవీ యాంకర్

ABN , First Publish Date - 2022-11-04T16:27:55+05:30 IST

మాజీ టీవీ యాంకర్ ఇసుదాన్ గధ్వి (Isudan Gadhvi)ని గుజరాత్ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమ్

Aam Aadmi Party : ఆప్ గుజరాత్ సీఎం అభ్యర్థిగా మాజీ టీవీ యాంకర్
Isudan Gadhvi

న్యూఢిల్లీ : మాజీ టీవీ యాంకర్ ఇసుదాన్ గధ్వి (Isudan Gadhvi)ని గుజరాత్ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ప్రకటించింది. దాదాపు పాతికేళ్ళ నుంచి అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించేందుకు ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 182 స్థానాలున్న శాసన సభకు ఎన్నికలు డిసెంబరు 1, 5 తేదీల్లో జరుగుతాయి. అదే నెల 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర ప్రజలు అత్యధికంగా భగవంత్ మాన్‌ (Bhagwant Mann)ను కోరుకోవడంతో ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదేవిధంగా గుజరాత్‌లో కూడా ఫోన్ నంబరును ప్రకటించి, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాలని కోరింది. మాజీ టీవీ యాంకర్ ఇసుదాన్ గధ్వికి 73 శాతం మంది మద్దతు పలకడంతో ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శుక్రవారం మాట్లాడుతూ, గుజరాత్ శాసన సభ ఎన్నికలకు తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్ గధ్విని ఎంపిక చేసినట్లు తెలిపారు. తాము నిర్వహించిన అభిప్రాయ సేకరణలో దాదాపు 16 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 73 శాతం మంది గధ్వికి మద్దతిచ్చారని చెప్పారు. ద్వారక జిల్లా, పిపాలియా గ్రామానికి చెందిన గధ్వి మాజీ టీవీ యాంకర్ అని, ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చారని తెలిపారు. ఆయన ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారని, రాష్ట్ర జనాభాలో వీరు 48 శాతం ఉన్నారని చెప్పారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) గుజరాత్ శాఖ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా ఈ సర్వేలో బాగా వెనుకబడ్డారు. ఆయన పాటిదార్ ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇదిలావుండగా, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ ఇప్పటి వరకు 118 మంది అభ్యర్థులను ప్రకటించింది.

తుది శ్వాస వరకు...

ఇసుదాన్ గధ్వి (40) గత ఏడాది జూన్‌లో ఆప్‌లో చేరారు. ఓ ప్రముఖ గుజరాతీ చానల్‌లో ఆయన యాంకర్‌గా చేశారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, ఓ సామాన్య రైతు బిడ్డనైన తనకు అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో గొప్ప బాధ్యతను అప్పగించారన్నారు. తాను చేయగలిగినంత బాగా పని చేయడానికి ప్రయత్నిస్తానన్నారు. గుజరాతీలందరికీ వారికి అవసరమైన ప్రతిదానినీ ఇస్తానన్నారు. తన తుది శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.

Updated Date - 2022-11-04T16:27:59+05:30 IST