పోలీసు స్టేషన్లో సంతకం చేసిన Ex minister
ABN , First Publish Date - 2022-03-15T14:12:05+05:30 IST
అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి డి.జయకుమార్ సోమవారం ఉదయం తిరుచ్చి కంటోన్మెంట్ పోలీసు స్టేషన్లో సంతకం చేశారు. చెన్నై కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ రోజున నకిలీ ఓట్లు వేశాడనే కారణంగా డీఎంకే

చెన్నై: అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి డి.జయకుమార్ సోమవారం ఉదయం తిరుచ్చి కంటోన్మెంట్ పోలీసు స్టేషన్లో సంతకం చేశారు. చెన్నై కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ రోజున నకిలీ ఓట్లు వేశాడనే కారణంగా డీఎంకే కార్యకర్తను అర్ధనగ్నంగా ఊరేగించడం, అదే సమయంలో ఎన్నికల్లో రిగ్గింగ్‌ను నిరోధించాలంటూ పోలీసుల అనుమతి లేకుండా రాస్తారోకో జరపటం వంటి సంఘటనలపై జయకుమార్‌ను అరెస్టు చేశారు. ఆ రెండు కేసుల్లో బెయిలు పొందిన జయ కుమార్‌ను చెన్నై సెంట్రల్ క్రైం విభాగం పోలీసులు బంధువును బెదిరించి అతడిచేపల వలల కర్మాగారాన్ని కబ్జా చేశారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిలు కోరుతూ జయకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంతో పుళల్ సెంట్రల్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు విధించిన బెయిలు షరతుల ప్రకారం ఆయన సోమవారం ఉదయం తిరుచ్చి కంటోన్మెంట్ పోలీసుస్టేషన్లో సంతకం చేశారు. బెయిలు షరతుల మేరకు జయకుమార్ రెండు వారాల పాటు తిరుచ్చిలోనే ఉండి సోమ, మంగళ, బుధవారాల్లో అక్కడి పోలీసు స్టేషన్లో సంతకం చేయాల్సి ఉంది. సోమవారం ఉదయం ఆయన తిరుచ్చి కంటోన్మెంట్ పోలీసుస్టేషన్లో సంతకం చేసేందుకు రాగా స్థానిక అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడి డీఎంకే ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలందరినీ అక్కడి నుండి తరిమివేశారు.