మాజీ మంత్రి ఇళ్లపై మళ్లీ ఏసీబీ దాడులు

ABN , First Publish Date - 2022-03-16T16:20:53+05:30 IST

అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి అక్రమార్జన నిగ్గు తేల్చేందుకు అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులు మరోమారు ఆకస్మిక తనిఖీలు నిర్వహిచారు. మంగళవారం ఉదయం వేలుమణి

మాజీ మంత్రి ఇళ్లపై మళ్లీ ఏసీబీ దాడులు

- ఎస్పీ వేలుమణి నివాసం సహా 58 చోట్ల తనిఖీలు

- భారీగా నగదు, బంగారం, వెండి స్వాధీనం


చెన్నై: అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి అక్రమార్జన నిగ్గు తేల్చేందుకు అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులు మరోమారు ఆకస్మిక తనిఖీలు నిర్వహిచారు. మంగళవారం ఉదయం వేలుమణి నివాసం సహా 58 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు. చెన్నై, కోవై సహా ఆరు జిల్లాల్లో తనిఖీలు జరిగాయి. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రిగా వ్యవహరించిన వేలుమణి తన బంధువులు, స్నేహితులు, అనుచరులకు అక్రమ పద్ధతుల్లో ప్రభుల్వ టెండర్లు కేటాయించి కోట్లాది రూపాయలను ముడుపులుగా తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ నేపథ్యంలో గత యేడాది ఆగస్టు 10న ఏసీబీ అధికారులు ఎస్పీ వేలుమణి నివాసం, కార్యాల యా లు, బంధువుల ఇళ్లు, పలు సంస్థలు సహా 60 చోట్ల తనిఖీ లు నిర్వహించి  కీలకమైన పత్రాలు, రూ.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేప థ్యంలో మంగళ వారం మళ్ళీ ఏసీబీ అధికారులు వేలుమణి నివాసం, బంధువులు, స్నేహితుల ఇళ్లు, కార్యాలయాలు సహా 58 ప్రాంతాల్లో సోదాలు చేశారు.  కేరళలోని ఓ ప్రాంతంలో వేలుమణి బంధువు  నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. 2016 నుంచి 2021 వరకు మంత్రిగా ఉంటూ ఆదాయానికి మించి రూ.58 కోట్ల మేర అక్రమంగా ఆర్జించినట్లు కోయంబత్తూరు అవినీతి నిరోధక విభాగం కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉదయం కోయంబత్తూరు సుగుణాపురంలో ఉన్న వేలుమణి నివాసంలో తెన్‌కాశి డీఎస్పీ మదిఅళగన్‌ నాయకత్వంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆ నివాసానికి రెండువైపులా ఉన్న తలుపులను మూసి లోపల గడియపెట్టుకుని అధికారులు సోదాలు జరిపారు. ఈ విషయం తెలుసుకుని అన్నాడీఎంకే స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆ ప్రాంతంలో గుమికూడారు. సుమారు యాభై మంది పోలీసులు ఆ ఇంటికి కాపలా కాశారు. ఈ తనిఖీలు జరుగుతున్నప్పుడు వేలుమణి ఇంటి లోనే ఉన్నారు. ఇదే విధంగా తొండా ముత్తూరులో ఉన్న వేలుమణి ఫామ్‌హౌస్‌, సుగుణాపురంలోని ఆయన సోదరుడు అన్బరసన్‌ నివాసం, కార్యాలయం, దుకాణంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. వేలుమణికి కుడిభుజంగా వ్యవహరించిన ఆయన అనుచరుడు వడవల్లి మహారాణి అవెన్యూలో నివసిస్తున్న ఎంజీఆర్‌ యువజన విభాగం నాయకుడు, ఇంజనీర్‌ చంద్రశేఖర్‌ ఇంటిలోనూ తనిఖీలు జరిగాయి. కోయంబత్తూరు చేరన్‌మానగర్‌లో ఉన్న సింగానల్లూరు ఎమ్మెల్యే కేఆర్‌ జయరామ్‌, వడవల్లిలో ఉన్న చంద్ర ప్రకాష్‌, ఎస్పీ వేలుమణి సహాయ కుడు సంతోష్‌ ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఎట్టిమలైలో మాజీ ఎమ్మెల్యే షణ్ముగం, సూలూరు లోని పార్టీ నాయకుడు కందవేల్‌, అన్నూరులోని సీఐ చంద్రకాంతా ఇళ్లు సహా కోయంబత్తూరు జిల్లాలోని 41 ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. సేలం లోని ప్రముఖ నగల దుకాణం, గ్రామీ ణాభివృద్ధి అధికారి నివాసం, నామ క్కల్‌, కృష్ణగిరిలో తలా ఒక చోట తనిఖీలు జరిపారు. 


పోలీసు అధికారుల ఇళ్ళలో...

కోయంబత్తూరులో నివసిస్తున్న ఇద్దరు పోలీసు అధికారుల నివాసా ల్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వేలుమణి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సానుకూలంగా వ్యవహరించి అక్రమాలకు పాల్ప డ్డారనే నేరారోపణలున్న ఆవారం పాళయం అదనపు డీఎస్పీ అనిత ఇంటిలో, అన్నూరులోని మహిళా సీఐ చంద్ర కాంత ఇంటిలోనూ గట్టి పోలీసుల కాపాల నడుమ తనిఖీలు నిర్వహించారు.


చెన్నైలో 8 చోట్ల తనిఖీలు...

చెన్నైలో నివసిస్తున్న ఎస్పీ వేలుమణి బంధువులు, స్నేహితులకు చెందిన నివాసాలు, కార్యాలయాలు సహా ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.  మైలాపూరు నరసింహపురం సుబ్బరాయన్‌ రోడ్డు లోని సెంథిల్‌కుమార్‌కు చెందిన భవనంలో వేలుమణి అనుచరుడు విష్ణువర్థన్‌ నడుపుతున్న సంస్థ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏడుగంటలకు ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు.  అన్నాసాలైలోని ఆల మ్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ సంస్థలో, టి.నగర్‌ తిరుమలై రోడ్డులోని రావన్‌ ట్రీ కార్యాలయంలో, నందనంలో పలు అంతస్థుల భవనంలో నివసిస్తున్న గణపతి నగల దుకాణదారుల ప్లాట్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదంబాక్కం ఈబీ కాలనీలో నివసిస్తున్న గ్రామీణాభి వృద్ధి శాఖ అధికారి శరవణకుమార్‌ ఇంటిలో మరో మూడు చోట్ల ఉదయం నుండి సాయంత్రం వరకూ ఈ తనిఖీలో కొనసాగాయి.


విదేశాల్లో ఆస్తులు కొన్నారా?

మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి విదేశాల్లోనూ అక్రమంగా ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిపై కూడా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. 2016 నుంచి 2021 వరకు వేలుమణి, ఆయన కుటుంబీకులు పలుమార్లు విదేశాల్లో పర్యటించారు.  ఆ సందర్భంగా వేలుమణి సుమారు రూ.2కోట్లకు పైగా ఖర్చుపెట్టారని, అదే సమయంలో ఆయా దేశాల్లో ఆస్తులు కూడా కొనుగోలు చేశారని ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.


రూ.83లక్షల నగదు, 11 కేజీల బంగారం స్వాధీనం

 మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ జరిపిన తనిఖీలలో రూ.83 లక్షల నగదు, 11.153 కేజీల బంగారం, 118 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నట్లు కోయంబత్తూరు అవినీతి నిరోధక విభాగం అధికారులు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలుమణి రూ.34 లక్షల వరకు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించామని, కీలకమై న పత్రాలనూ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.Read more