Former Chief Minister: లోక్‌సభ ఎన్నికల బరిలోకి యడియూరప్ప
ABN , First Publish Date - 2022-08-19T17:09:56+05:30 IST
బీజేపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా అత్యున్నత పదవిలో నియమితులైన మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప లోక్‌సభ ఎన్నికల బరిలోకి

- షికారిపుర నుంచి తనయుడు విజయేంద్ర పోటీ?
బెంగళూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): బీజేపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా అత్యున్నత పదవిలో నియమితులైన మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. శివమొగ్గ నియోజకవర్గం(Shivmogga Constituency) నుంచి యడియూరప్ప పోటీచేయడం ఖాయమని పార్టీ వర్గాలను ఉటంకిస్తూ గురువారం తెలిసింది. ప్రస్తుతం యడియూరప్ప శివమొగ్గ జిల్లాలోని షికారిపుర శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి విదితమే. ఈ నియోజకవర్గాన్ని తన చిన్న కుమారుడు బీవై విజయేంద్ర(BY Vijayendra)కు అప్పగించాలని య డియూరప్ప ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇందుకు అధిష్టానం ఆమోద ముద్రే ఇక తరువాయి. శివమొగ్గ లోక్‌సభా నియోజకవర్గానికి ప్రస్తుతం యడియూరప్ప పెద్ద కుమారుడు బీవై రాఘవేంద్ర ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రాఘవేంద్రను పార్టీ సేవలకు వినియోగించుకోవాలని అధిష్టానం పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. యడియూరప్ప లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగితే పార్టీకి రాజకీయంగా లబ్ది చేకూరుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలోనూ ఒకసారి యడియూరప్ప శివమొగ్గ లోక్‌సభ(Shivmogga Lok Sabha) నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కన్నడ నాట 25 లోక్‌సభ స్ధానాలను గెలుచుకున్న బీజేపీకి ఈ సారి సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ నివేదికల హెచ్చరికల నేపథ్యంలో కనీసం డజను మంది సిట్టింగ్ ఎంపీలకు ఈ సారి టికెట్లు దక్కకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. వీరందరి సేవలను పార్టీకి వినియోగించుకుంటారని ఈ మేరకు పార్టీ కార్యకవర్గానికి త్వరలోనే మేజర్ సర్జరీ చేసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రుల్లో ఒకరిద్దరు టికెట్లు నిరాకరించే జాబితాలో ఉండవచ్చునని తెలుస్తోంది. వారసత్వ రాజకీయాల ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ అధిష్టానం కొన్ని ప్రత్యేక పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని యడియూరప్ప(Yeddyurappa) కుటుంబంలో మరొకరికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించాలని తీర్మానించుకున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్లమెంటరీ బోర్డులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న యడియూరప్ప లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి అవకాశం లభిస్తే కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.