Please Change: న్యాయమూర్తిని మార్చండి ప్లీజ్ !
ABN , First Publish Date - 2022-08-04T13:21:33+05:30 IST
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) నేతృత్వంలో జరిగిన రెండు సర్వసభ్యమండలి

- సీజేకు ఓపీఎస్ వినతి
చెన్నై, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) నేతృత్వంలో జరిగిన రెండు సర్వసభ్యమండలి సమావేశాలు చెల్లవని ప్రకటించాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరో న్యాయమూర్తితో జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్‌నాధ్ భండారికి విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశాలకు వ్యతిరేకంగా ఓపీఎస్ వర్గీయులు రెండుసార్లు వేసిన పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి(Krishnan Ramaswamy) తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఓపీఎస్ సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, ఈ వ్యవహారాలను హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ సుప్రీం తేల్చి చెప్పింది. రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు జారీ చేసిన తాజా ఉత్తర్వు నకలు హైకోర్టు న్యాయమూర్తి కృష్ణన్రామస్వామికి అందింది. దీంతో ఓపీఎస్ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సమాయత్తమయ్యారు.
ఆ మేరకు గురువారం ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభమవుతుందని హైకోర్టు రిజిస్ట్రార్(High Court Registrar) జనరల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సర్వసభ్యమండలి సమావేశాలకు వ్యతిరేకంగా తాను దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి కాకుండా మరో న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చీఫ్ జస్టిస్‌కు ఓపీఎస్ తరఫు న్యాయవాది వినతిపత్రం అందించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరగాల్సివుంది. కానీ ఇప్పుడు ఓపీఎస్ అభ్యర్థన పట్ల ప్రధాన న్యాయమూర్తి తీసుకునే నిర్ణయాన్ని బట్టి గురువారం విచారణ వుంటుందని తెలిసింది.