Enforcement Directorate : నాలుగేళ్ళలో రెట్టింపు బలోపేతమైన ఈడీ

ABN , First Publish Date - 2022-08-02T23:06:28+05:30 IST

మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించేవారి భరతం పట్టడానికి ఏర్పాటైన

Enforcement Directorate : నాలుగేళ్ళలో రెట్టింపు బలోపేతమైన ఈడీ

న్యూఢిల్లీ : మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించేవారి భరతం పట్టడానికి ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ఈడీ) గడచిన నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకుని రెట్టింపు బలం పుంజుకుంది. ఈ సంస్థ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా (Sanjay Kumar Mishra) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికారులు, సిబ్బంది పెరిగారు. 


సంజయ్ కుమార్ మిశ్రా 2018లో ఈడీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఈ సంస్థకు ఐదుగురు ప్రత్యేక డైరెక్టర్లు, 18 మంది జాయింట్ డైరెక్టర్లు ఉండేవారు. వీరంతా ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులే. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల్లో పని చేసే అధికారులు ఈడీకి డిప్యుటేషన్‌పై వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈడీకి తొమ్మిది మంది స్పెషల్ డైరెక్టర్లు, ముగ్గురు అడిషినల్ డైరెక్టర్లు, 36 మంది జాయింట్ డైరెక్టర్లు, 18 మంది డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు. మరోవైపు ఈ సంస్థకు డిప్యుటేషన్‌పై తీసుకురావడానికి ఆదాయపు పన్ను శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అండ్ ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ప్రాధాన్యమిస్తున్నారు. 


అంతేకాకుండా ఈ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రాంతీయ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసింది. మేఘాలయ, కర్ణాటక, మణిపూర్, త్రిపుర, సిక్కిం వంటి రాష్ట్రాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసింది. గత ఏడాది ఆగస్టులో మేఘాలయ, మణిపూర్‌లలో కార్యాలయాలను ఏర్పాటు చేసింది. మేఘాలయలోని షిల్లాంగ్‌లో మరొక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీనికి డిప్యూటీ డైరెక్టర్ ర్యాంక్ అధికారి నేతృత్వం వహిస్తారు. ఇంఫాల్‌లో కూడా మరొక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయాలు గువాహటిలోని జోనల్ కార్యాలయం-2 పరిధిలో పని చేస్తాయి. 


కర్ణాటకలోని మంగళూరులో గత ఏడాది సెప్టెంబరులో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది, దీనికి డిప్యూటీ డైరెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్రంలోని 15 జిల్లాలపై దీనికి అధికార పరిధి ఉంది. ఈశాన్య ప్రాంతంలో నాలుగో సబ్ జోనల్ ఆఫీస్‌ను గ్యాంగ్‌టక్‌లో గత ఏడాది అక్టోబరులో ఏర్పాటు చేసింది. అగర్తలలో కూడా ఇటువంటి సబ్ జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 


పెరిగిన మానవ వనరులు 

మానవ వనరుల విషయంలో కూడా ఈడీ బలోపేతమైంది. సంజయ్ కుమార్ మిశ్రాను ఫుల్‌ టైమ్ ఈడీ డైరెక్టర్‌గా 2018 నవంబరులో కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన 1984 బ్యాచ్ ఆదాయపు పన్ను కేడర్‌ ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి. ఆయన అంతకుముందు ఈడీ ప్రిన్సిపల్ స్పెషల్ డైరెక్టర్‌గా పని చేశారు. 


కేసుల సంఖ్య మూడు రెట్లు

మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002; విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA), 1999; పరారైన ఆర్థిక నేరగాళ్ళ చట్టం, 2018లను అమలు చేయడం ఈడీ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మొదటిసారి ఏర్పాటైన తొలి మూడేళ్ళలో (2014-15 నుంచి 2016-17 వరకు) నమోదైన FEMA, PMLA కేసుల కన్నా ఆయన నేతృత్వంలో రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వం తొలి మూడేళ్ళ పాలనా కాలం (2019-20 నుంచి 2021-22 వరకు)లో ఈ కేసుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. అదే విధంగా దర్యాప్తు కోసం చేపట్టిన ఫెమా కేసుల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా ఉంది. సోదాలను పెంచడంతోపాటు, పెండింగ్ కేసుల దర్యాప్తు, కొత్త కేసుల్లో నిర్ణీత గడువులో దర్యాప్తు పూర్తి చేయడం వంటివాటిపై ఈడీ దృష్టి సారించింది. 


అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో మరింత శక్తిమంతం

మరోవైపు సుప్రీంకోర్టు తాజా తీర్పు ఈడీని మరింత బలోపేతం చేసింది. పీఎంఎల్ఏలోని వివిధ నిబంధనలను వివరించి, ఈడీకి ఉన్న అధికారాలను అత్యున్నత న్యాయస్థానం తేటతెల్లం చేసింది. నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి, వారిని అరెస్టు చేయడానికి ఈడీకి అధికారం ఉందని చెప్పింది. 


పదవీ కాలం పొడిగింపుపై సుప్రీంకోర్టు నోటీసు

ఇదిలావుండగా, కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ఈడీ) చీఫ్‌ల పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) విచారణకు చేపట్టింది. ఈ పిటిషన్లపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ఈడీ డైరెక్టర్‌ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించడాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు.



Updated Date - 2022-08-02T23:06:28+05:30 IST