National Herald: నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఈడీ దూకుడు.. నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌కు సీల్..

ABN , First Publish Date - 2022-08-03T23:52:44+05:30 IST

నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ కీలక మలుపు తీసుకుంది. మనీ లాండరింగ్ కేసులో..

National Herald: నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఈడీ దూకుడు.. నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌కు సీల్..

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ కీలక మలుపు తీసుకుంది. మనీ లాండరింగ్ కేసులో నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికితాజాగా ఈడీ అధికారులు సీల్ వేశారు. ఈడీ అనుమతి లేకుండా కార్యాలయం తెరవకూడదని అధికారులు స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case) విచారణలో దర్యాప్తు ఏజెన్సీ ఈడీ (ED) మరింత దూకుడు పెంచింది. ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కార్యాలయంతో పాటు మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు(Raids) నిర్వహించింది. తాజాగా నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికి సీల్ వేసింది. కేసు విచారణలో కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)ని ప్రశ్నించిన అనంతరం ఈడీ ఈ మేరకు రంగంలోకి దిగింది. గత నెల జులైలో సోనియాని ఈడీ దాదాపు 12 గంటలు ప్రశ్నించింది. 100కిపైగా ప్రశ్నలు సంధించింది. అంతకుముందు రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కూడా 5 రోజులకుపైగా 150కిపైగా ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే.


అసలు ఏంటీ నేషనల్ హెరాల్డ్ కేసు..?

నేషనల్‌ హెరాల్డ్‌ వార్తాపత్రికను ప్రచురించే అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌) కంపెనీని కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలపై 2012 నవంబరు 1న ఢిల్లీలోని ఓ కోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రైవేటు కేసు దాఖలు చేశారు. వారిద్దరూ మోసానికి పాల్పడ్డారని, ఏజేఎల్‌కు చెందిన వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాజేశారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఢిల్లీ, యూపీ తదితర ప్రాంతాల్లో ఏజేఎల్‌కు ఉన్న రూ.1,600 కోట్ల విలువైన ఆస్తులను వారిద్దరూ యజమానులుగా ఉన్న యంగ్‌ ఇండియన్‌ కంపెనీ ద్వారా మోసపూరితంగా దక్కించుకున్నారని పేర్కొన్నారు. ఈ కేసులోనే మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణ జరిపిన ఈడీ సోనియా, రాహుల్‌లకు సమన్లు జారీ చేసింది. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కంపెనీల చట్టం, షేర్ల బదిలీలకు సంబంధించిన సంక్లిష్టమైన కేసుగా ఇది కనిపిస్తోంది. వివాదం అంతా 2011 జనవరిలో జరిపిన ఏజేఎల్‌ షేర్ల కొనుగోలు వ్యవహారంలోనే ఉంది.షేర్‌ హోల్డర్లుగా స్వాతంత్య్ర సమరయోధులు 

దేశ స్వాతంత్ర్యానికి ముందు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 5 వేల మంది స్వాతంత్య్ర సమరయోధుల నుంచి నిధులు సమీకరించి ఏజేఎల్‌ను ఏర్పాటు చేశారు. ఆ ఐదువేల మంది ఈ కంపెనీకి షేర్‌ హోల్డర్లు. భారత కంపెనీల చట్టం-1913 కింద 1937 నవంబరు 20న ఏజేఎల్‌ను పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా ప్రకటించారు. దీని ఆధ్వర్యంలో నేషనల్‌ హెరాల్డ్‌ పేరిట ఆంగ్ల వార్తాపత్రిక ప్రచురణను 1938లో ప్రారంభించారు. అలాగే హిందీలో నవజీవన్‌, ఉర్దూలో ఖౌమీ ఆవాజ్‌ వార్తాప్రతికలనూ ఏజేఎల్‌ ప్రచురించింది.


షేర్ల బదలాయింపు

ఏజేఎల్‌ నష్టాల్లో ఉందంటూ నేషనల్‌ హెరాల్డ్‌ సహా ఆ సంస్థకు చెందిన అన్ని పత్రికల ముద్రణనూ 2008 ఏప్రిల్‌లో నిలిపివేశారు. అనంతరం ఆ సంస్థ ఆస్తులను అద్దెకు ఇచ్చేందుకు కూడా అనుమతిచ్చారు. 2010 సెప్టెంబరు 1న లఖ్‌నవూలోని ఏజేఎల్‌ కార్యాలయాన్ని ఢిల్లీలోని హెరాల్డ్‌ హౌస్‌లోకి తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఏజేఎల్‌కు ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ ఏఐసీసీ(ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ) రుణాలు ఇచ్చింది. ఈ రుణాలు 2010 డిసెంబరు 16 నాటికి రూ.90.21 కోట్లకు చేరాయి. అదే రోజున ఈ మొత్తం రుణ బకాయిలను, ఏజేఎల్‌కు చెందిన 99.99 శాతం షేర్లను యంగ్‌ ఇండియన్‌కు ఏఐసీసీ బదలాయించింది. ప్రతిగా యంగ్‌ ఇండియన్‌ కంపెనీ రూ.50 లక్షలు చెల్లించింది. అంతకు మూడు రోజుల ముందే యంగ్‌ ఇండియన్‌ కంపెనీ తొలి మేనేజింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, రాహుల్‌ గాంధీని డైరెక్టర్‌గా నియమించారు.


ఏజేఎల్‌ ఆస్తులు ఇవీ..

ఏజేఎల్‌ రియల్‌ ఎస్టేట్‌ విలువను రూ.5 వేల కోట్లుగా అంచనా వేశారు. ఆ సంస్థకు హెరాల్డ్‌ హౌస్‌ పేరిట ఢిల్లీలో 10,000 చదరపు మీటర్ల స్థలంలో 6 అంతస్థుల భవనం ఉంది. దీంతోపాటు లఖ్‌నవూ, భోపాల్‌, ముంబై, ఇండోర్‌, పట్నా, పంచకుల తదితర ప్రాంతాల్లోనూ ఆ సంస్థకు ఆస్తులు ఉన్నాయి.‘యంగ్‌ ఇండియన్‌’ యజమానులు వీరే.. 

యంగ్‌ ఇండియన్‌ అనేది ఒక ప్రైవేటు కంపెనీ. దీన్ని 2010 నవంబరు 23న స్థాపించారు. ఇందులో సోనియా, రాహుల్‌లకు సంయుక్తంగా మెజారిటీ(76 శాతం) షేర్లు ఉన్నాయి. మిగిలిన 24 శాతం షేర్లు కాంగ్రెస్‌ నేతలు మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌(చెరో 12 శాతం) పేరిట ఉన్నాయి. ఢిల్లీలోని హెరాల్డ్‌ హౌస్‌లోనే ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. 2011 జనవరి 22న యంగ్‌ ఇండియన్‌ సంస్థకు తాజా షేర్ల కేటాయింపు జరిపారు. ఏజేఎల్‌ షేర్ల స్వాధీనం 100 శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో రూ.47,513 విలువైన షేర్లను రాహుల్‌గాంధీ, రూ.2,62,411 విలువైన షేర్లను ఆయన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా.. రతన్‌ దీప్‌ ట్రస్ట్‌, జన్‌హిత్‌ నిధి ట్రస్ట్‌ల ద్వారా కొనుగోలు చేశారని, ఇందులో కంపెనీల చట్టం నిబంధనలను పాటించలేదని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఏజేఎల్‌కు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను సొంతం చేసుకోడానికి కాంగ్రెస్‌ పార్టీ నిధులను సోనియా, రాహుల్‌ వాడుకున్నారు. ఆ సంస్థ భూములనూ కాజేశారు.


ఆర్థిక మోసాలకూ పాల్పడ్డారు. ఏఐసీసీ నుంచి ఏజేఎల్‌ తీసుకున్న రూ.90 కోట్ల రుణాలను యంగ్‌ ఇండియన్‌కు బదిలీ చేయడం ద్వారా ఏజేఎల్‌లోని మొత్తం 9 కోట్ల షేర్లను(ఒక్కో షేర్‌ విలువ రూ.10) యంగ్‌ ఇండియన్‌ సంస్థ పొందింది. వాణిజ్య అవసరాల కోసం రాజకీయ పార్టీ డబ్బును అప్పుగా ఇవ్వడం ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 29ఏ, బీ, సీ సెక్షన్లు, ఆదాయ పన్నుల చట్టం 1961లోని సెక్షన్‌ 13ఏ ప్రకారం అక్రమమని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.

Read more