పంజాబ్ మాజీ సీఎం చన్నీపై ఈడీ ప్రశ్నల వర్షం
ABN , First Publish Date - 2022-04-14T20:57:38+05:30 IST
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని అక్రమ ఇసుక

జలంధర్ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని అక్రమ ఇసుక తవ్వకాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం (ఏప్రిల్ 13న) దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించింది. ఈ విషయాన్ని ఆయన ఓ ట్వీట్ ద్వారా గురువారం తెలిపారు. ఆయన మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీ ఈ కేసులో ప్రధాన నిందితుడు.
చన్నీ ఇచ్చిన ట్వీట్లో, మైనింగ్ కేసులో తనను ఈడీ బుధవారం పిలిచిందని తెలిపారు. వారు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసినంత వరకు సమాధానాలు చెప్పానన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఓ చలానాను కోర్టుకు ఈడీ సమర్పించిందన్నారు. మరోసారి రావాలని తనను అధికారులు కోరలేదని చెప్పారు.
ఈ కేసులో ఆయనను ఈడీ గతంలో రెండుసార్లు పిలిచింది. కానీ అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన ఈడీ సమక్షంలో హాజరుకాలేదు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, చన్నీపై ఈడీ అధికారులు బుధవారం ప్రశ్నల వర్షం కురిపించారు. హనీ నుంచి స్వాధీనం చేసుకున్న రూ.10 కోట్ల నగదు గురించి ప్రధానంగా ప్రశ్నించారని తెలుస్తోంది. చన్నీ పంజాబ్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో అధికారులు, ఉద్యోగులను బదిలీలు చేయించినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా ప్రశ్నించినట్లు సమాచారం.
హనీ సన్నిహితుడు కుద్రత్దీప్ సింగ్, తదితరులపై రహోన్ పోలీస్ స్టేషన్లో 2018 మార్చిలో కేసు నమోదైంది. దీని ఆధారంగా ఈడీ 2021 నవంబరు 30న ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును నమోదు చేసింది. గనుల యజమానులు, వారి సహచరులపై దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసులో ఏప్రిల్ 1న ఈడీ ఛార్జిషీటును దాఖలు చేసింది.
హనీ, ఆయన స్నేహితుడు సందీప్ కుమార్ డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలను కుద్రత్దీప్ సింగ్ మనీలాండరింగ్ కోసం ఉపయోగించుకున్నట్లు ఈడీ ఆరోపించింది. ఇసుక అక్రమ వ్యాపారం వల్ల సంపాదించిన సొమ్మును మనీలాండరింగ్ చేసినట్లు పేర్కొంది. ఈ కంపెనీల్లో అధికారులు జరిపిన సోదాల్లో రూ.10 కోట్ల మేరకు నగదు, బంగారం, ఖరీదైన వాచీ, నేరారోపణ చేయదగిన కొన్ని దస్తావేజులు లభించాయి. దర్యాప్తునకు సహకరించడం లేదంటూ హనీని జలంధర్లో ఫిబ్రవరి 3న ఈడీ అరెస్టు చేసింది.