Cholera outbreak: ఒడిశాలో కలరా కలకలం...8మంది మృతి

ABN , First Publish Date - 2022-07-22T16:27:43+05:30 IST

ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలోని కాశీపూర్ బ్లాక్‌లో ప్రబలిన కలరా కలకలం రేపింది...

Cholera outbreak: ఒడిశాలో కలరా కలకలం...8మంది మృతి

భువనేశ్వర్(ఒడిశా): ఒడిశా(Odisha) రాష్ట్రంలోని రాయగడ జిల్లాలోని కాశీపూర్( Kashipur) బ్లాక్‌లో ప్రబలిన కలరా కలకలం(Cholera outbreak) రేపింది.ఈ కలరా వల్ల 8 మంది మరణించారు. కలుషిత  నీటి ద్వారా సంక్రమించే కలరా వ్యాధిన పడిన పలువురు ఆసుపత్రుల పాలయ్యారు. కాశీపూర్‌లోని 8 పంచాయతీల్లో 6 గ్రామాల్లో కలరా కేసులు నమోదయ్యాయి.కలరాతో 120 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 8 మంది మరణించారు. దుడుకబహల్‌ పంచాయతీలో 65 మంది కలరా బారిన పడగా, తికిరి పంచాయతీలో 48 మందికి వ్యాధి సోకింది.నకతిగూడ పంచాయతీ సనమతికాన గ్రామానికి చెందిన దాల్మీ మాఝీ (60) అనే వృద్ధురాలు కలరా వ్యాధితో ఇటీవల మృతి చెందింది. సోమవారం రాత్రి కడుపునొప్పి, లూజ్‌ మోషన్స్‌తో బాధపడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


నీటిలో బాక్టీరియాను కనుగొన్నారు.రాయగడ జిల్లా కలెక్టర్ స్వధా దేవ్ సింగ్, భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం వైద్యుల బృందం అధిపతి డాక్టర్ బిభూతి భూషణ్ పాల్ పరిస్థితిని విశ్లేషించడానికి గ్రామానికి చేరుకున్నారు.వారు సుమారు పది నమూనాలను పరీక్షించారు. మూడు నమూనాలలో విబ్రియో కలరే బ్యాక్టీరియాను కనుగొన్నారు. కాశీపూర్ బ్లాక్ నుంచి సేకరించిన నీటి నమూనాలలో కూడా బ్యాక్టీరియాను కనుగొన్నారు. కలరా బారిన పడిన రోగులకు చికిత్స కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.కాశీపూర్‌లోని మండిపిసి, దంగలిసి గ్రామాల్లో రెండు తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. గుగుపుట్, డెంగాగూడ, రామగూడ గ్రామాల్లో మూడు మొబైల్ హెల్త్ యూనిట్లు ఏర్పాటు చేశారు.బ్యాక్టీరియా కనిపించిన ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు రోగులను ముందస్తుగా గుర్తించడం కోసం ఇంటింటికీ తిరుగుతూ స్క్రీనింగ్ చేస్తున్నారు. 


Updated Date - 2022-07-22T16:27:43+05:30 IST