పార్టీకి నష్టం చేసింది చాలక బీ ఫారాలు అడుగుతారా?

ABN , First Publish Date - 2022-07-01T15:53:14+05:30 IST

పార్టీకి తీరని నష్టం కలిగించింది చాలక స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల బిఫారాలపై సంతకం పెడతానంటూ అడగడం భావ్యమేనానని అన్నాడీఎంకే

పార్టీకి నష్టం చేసింది చాలక బీ ఫారాలు అడుగుతారా?

                           - ఓపీఎస్‏కు ఈపీఎస్‌ ఘాటుగా లేఖ


చెన్నై, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): పార్టీకి తీరని నష్టం కలిగించింది చాలక స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల బిఫారాలపై సంతకం పెడతానంటూ అడగడం భావ్యమేనానని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్)ను, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో నగరపంచాయతీ పదవులకు పోటీ చేసే అభ్యర్థుల బీ ఫారాలు పంపితే సంతకం చేస్తానంటూ బుధవారం ఓపీఎస్‌ ఈపీఎస్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖకు ఈపీఎస్‌ గురువారం సమాధానమిస్తూ.. ఈ నెల 23న పార్టీ నిర్వాహకుల సమావేశానికి గైర్హాజరవటంతోపాటు ఈ నెల 11న తాము తలపెట్టిన సర్వసభ్యమండలి సమావేశాన్ని అడ్డుకునేలా హైకోర్టులో పిటిషన్‌ వేసి పార్టీకి వీలైనంత నష్టం చేసి మళ్లీ తనకు ఎలా లేఖ రాస్తారని ప్రశ్నించారు. పార్టీకి వరుసగా కళంకాలు కల్పిస్తూ రాసిన లేఖ చెల్లదన్నారు. అంతే కాకుండా ఇటీవల సర్వసభ్యమండలి సమావేశంలో పార్టీ సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులు ఖాళీ అయ్యాయని, అలాంటప్పుడు సమన్వయకర్త పేరుతో ఎలా లేఖరాస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం సమన్వయకర్తగా లేరనే విషయాన్ని ఓపీఎస్‌ గుర్తించాలన్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనున్న తరుణంలో బీఫారాల్లో సంతకం చేస్తానంటూ లేఖ రాయడం పార్టీ పట్ల ఏ మాత్రం శ్రద్ధలేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. సర్వసభ్య మండలి సమావేశానికి అనుమతివ్వకూడదని ఆవడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులోనూ కేసులు దాఖలు చేసిన ఓపీఎస్‌ తనకు లేఖరాయడాన్ని పార్టీ శ్రేణులు కూడా ఏ మాత్రం సహించరని ఈపీఎస్‌ ఆ లేఖలో ఘాటుగా బదులిచ్చారు.

Read more