కార్యకర్త నుంచి ప్రధాన కార్యదర్శి దాకా...

ABN , First Publish Date - 2022-07-12T15:53:31+05:30 IST

ఊహించినట్లే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆ పార్టీ పగ్గాలను స్వీకరించారు. తాత్కాలిక ప్రధాన

కార్యకర్త నుంచి ప్రధాన కార్యదర్శి దాకా...

                          - అంచెలంచెలుగా ఎదిగిన Eps


చెన్నై, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఊహించినట్లే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆ పార్టీ పగ్గాలను స్వీకరించారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అని పేర్కొన్నప్పటికీ.. ప్రస్తుతం ఆ పార్టీలో ఆయనే సర్వాధికారి. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ అభిమానిగా అన్నాడీఎంకేలో కార్యకర్తగా చేరి తన స్వస్థలమైన సిలువంపాళయంలో పార్టీ గ్రామీణ శాఖ కార్యదర్శిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1954లో సేలం జిల్లా ఎడప్పాడి సమీపంలోని సిలువంపాళయం గ్రామంలో సాధారణ వ్యయసాయ కుటుంబానికి చెందిన కరుప్ప గౌండర్‌, తవసాయి అమ్మాళ్‌ దంపతులకు ఆయన జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం తర్వాత ఈరోడ్‌ వాసవి కళాశాలలో బైపీసీ గ్రూపులో ఇంటర్‌ దాకా చదివారు. ఆ తర్వాత బెల్లపు మండీ కమిషన్‌ వ్యాపారంలో దిగారు. అదే సమయంలో రాజకీయాలపై ఆసక్తి పెరిగి ఎంజీఆర్‌పై అభిమానంతో అన్నాడీఎంకేలో చేరారు. 1989లో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 1999, 2004లో లోక్‌సభ ఎన్నికల్లో తిరుచెంగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1989, 1991, 2011, 2016 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా గెలిచారు. 2011లో జయ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. రహదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2016లో శాసనసభ్యుడిగా గెలిచి మళ్లీ మంత్రిపదవిని చేపట్టారు. 1989లో ఎంజీఆర్‌ మృతి తర్వాత జయలలిత వర్గంలో చేరి ఆమె అభిమానానికి పాత్రులయ్యారు. ఆ ఏడాది కోడిపుంజు చిహ్నంపై పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచారు. 2017లో ఎడప్పాడిని ఊహించని విధంగా ముఖ్యమంత్రి పదవి వరించింది. జయ మృతి తర్వాత పార్టీలో ఏర్పడిన పరిణామాలతో అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ అక్రమార్జన కేసులో నాలుగేళ్ల జైలు శిక్షపడి బెంగళూరు పరప్పన అగ్రహారం జైలుకెళుతూ.. ఎడప్పాడిని పార్టీ శాసనసభాపక్షనాయకుడిగా ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన వెంటనే ఎడప్పాడి శశికళకు సాష్టాంగ ప్రమాణం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2017 ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. పలు ఆటుపోట్లను ఎదుర్కొంటూ.. అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని నడిపారు. శశికళ వర్గాన్ని తట్టుకునేందుకు ఓపీఎస్‏ను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు ఆయనకు పార్టీ సమన్వయకర్త పదవినీ ఇచ్చారు. ప్రభుత్వం పోయాక.. పార్టీ పగ్గాలను ఓపీఎస్‏తో కలిసి పంచుకోవడం ఇష్టంలేని ఈపీఎస్‌.. ఆ మేరకు చక్రం తిప్పారు. గత జూన్‌ 23న పార్టీ పగ్గాలు చేపట్టేదిశగా ప్రణాళిక రూపొందించుకున్నారు. పార్టీకి ద్వంద్వ నాయకత్వం వద్దంటూ రేగిన అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. సోమవారం సర్వసభ్యమండలిలో తాను రూపొందించిన ప్రణాళికను అమలు పరచి మెజారిటీ సభ్యుల ఆమోదంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Read more