మనీలాండరింగ్ కేసులో ఒమర్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ

ABN , First Publish Date - 2022-04-07T22:47:26+05:30 IST

జమ్మూ-కశ్మీరు బ్యాంకు మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి

మనీలాండరింగ్ కేసులో ఒమర్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరు బ్యాంకు మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. రుణాల మంజూరు, పెట్టుబడుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఈ బ్యాంకు మాజీ చైర్మన్ ముష్తాక్ అహ్మద్ షేక్, తదితరులపై అంతకుముందు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) కేసును నమోదు చేసింది. దీని ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రకారం కేసును ఈడీ నమోదు చేసింది. 


ముంబైలోని బాంద్రా కుర్లాలో ఓ ఆస్తిని మితిమీరిన ధరకు 2010లో కొన్నట్లు జమ్మూ-కశ్మీరు బ్యాంకు మేనేజ్‌మెంట్‌పై సీబీఐ 2021లో కేసును నమోదు చేసింది. మెసర్స్ ఆకృతి గోల్డ్ బిల్డర్స్ నుంచి ఈ ఆస్తిని రూ.180 కోట్లకు కొన్నట్లు ఆరోపించింది. చక్కని ప్రణాళికతో కూడిన కుట్రతో టెండరింగ్ ప్రాసెస్‌ను పట్టించుకోకుండా ఈ ఆస్తిని కొన్నట్లు తెలిపింది. 


ఒమర్ అబ్దుల్లాను ఈడీ అధికారులు ప్రశ్నించడంతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఘాటుగా స్పందించింది. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఏదో సాధించాలనుకుని చేస్తున్న ఈ దర్యాప్తు వల్ల బీజేపీకి ఎటువంటి ప్రయోజనాలు దక్కవని తెలిపింది. అవసరమైనపుడు ప్రజలు తమకు గట్టిగా మద్దతిస్తారని పేర్కొంది. ఎన్నికలను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తూ ఉండేదని, ఇప్పుడు ఆ పనిని ఈడీ చేస్తోందని ఆరోపించింది. రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నపుడు ఈడీ, సీబీఐ వంటి సంస్థలు రంగంలోకి దిగి, బీజేపీకి సవాలు విసిరే పార్టీలను టార్గెట్ చేస్తున్నాయని మండిపడింది. 


Updated Date - 2022-04-07T22:47:26+05:30 IST