Rahul Gandhi ED News: ముగిసిన రాహుల్ ఈడీ విచారణ.. రేపు కూడా హాజరు కావాలని ఆదేశాలు

ABN , First Publish Date - 2022-06-21T02:30:25+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేటి ఈడీ విచారణ ముగిసింది. మంగళవారం (21-06-2022) కూడా విచారణకు హాజరు కావాలని..

Rahul Gandhi ED News: ముగిసిన రాహుల్ ఈడీ విచారణ.. రేపు కూడా హాజరు కావాలని ఆదేశాలు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేటి ఈడీ విచారణ ముగిసింది. మంగళవారం (21-06-2022) కూడా విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేసింది. సోమవారం నాలుగో రోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇప్పటివరకు రాహుల్‌ను 30 గంటల పాటు ఈడీ అధికారులు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారించారు. కాంగ్రెస్‌ ఆందోళనలతో ఈడీ కార్యాలయం, జంతర్‌మంతర్‌ దగ్గర పోలీస్‌ భద్రతను పెంచారు. సోమవారం ఏఐసీసీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. కార్యకర్తలను ఏఐసీసీ ఆఫీస్‌లోకి పోలీసులు అనుమతించలేదు. ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసులోనే విచారణకు హాజరు కావాలని సమన్లు అందుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. 


కోవిడ్ నుంచి కోలుకున్న సోనియా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందారని జైరాం రమేశ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. డిశ్చార్జ్ అయినప్పటికీ ఇంట్లోనే మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సోనియాకు సూచించినట్లు ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కాంగ్రెస్ ఎంపీల బృందం సోమవారం కలుసుకుంది. రెండు అంశాలపై రాష్ట్రపతికి లేఖలు ఇచ్చామని ఆ బృందంలోని కీలక నేత మల్లికార్జున ఖర్గే రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. రాహుల్‌పై ఈడీవి తప్పుడు చేసులని, ప్రశాంత వాతావరణంలో సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ నేతలను భయపెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్ నేతలను గంటల తరబడి పీఎస్‌లలో నిర్బంధిస్తున్నారని ఖర్గే వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ స్కీమ్‌ను తప్పుగా రూపొందించారని, దీనివల్ల రక్షణ శాఖకు లాభం లేదని మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో జైరాం రమేష్, మల్లిఖర్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్, చిదంబరం, అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు.


అసలు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case) ఏంటి..?


దేశ స్వాతంత్య్రానికి ముందు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 5 వేల మంది స్వాతంత్య్ర సమరయోధుల నుంచి నిధులు సమీకరించి ఏజేఎల్‌ను ఏర్పాటు చేశారు. ఆ ఐదువేల మంది ఈ కంపెనీకి షేర్‌ హోల్డర్లు. భారత కంపెనీల చట్టం-1913 కింద 1937 నవంబరు 20న ఏజేఎల్‌ను పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా ప్రకటించారు. దీని ఆధ్వర్యంలో నేషనల్‌ హెరాల్డ్‌ పేరిట ఆంగ్ల వార్తాపత్రిక ప్రచురణను 1938లో ప్రారంభించారు. అలాగే హిందీలో నవజీవన్‌, ఉర్దూలో ఖౌమీ ఆవాజ్‌ వార్తాప్రతికలనూ ఏజేఎల్‌ ప్రచురించింది.


ఏజేఎల్‌ నష్టాల్లో ఉందంటూ నేషనల్‌ హెరాల్డ్‌ సహా ఆ సంస్థకు చెందిన అన్ని పత్రికల ముద్రణనూ 2008 ఏప్రిల్‌లో నిలిపివేశారు. అనంతరం ఆ సంస్థ ఆస్తులను అద్దెకు ఇచ్చేందుకు కూడా అనుమతిచ్చారు. 2010 సెప్టెంబరు 1న లఖ్‌నవూలోని ఏజేఎల్‌ కార్యాలయాన్ని ఢిల్లీలోని హెరాల్డ్‌ హౌస్‌లోకి తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఏజేఎల్‌కు ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ ఏఐసీసీ(ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ) రుణాలు ఇచ్చింది. ఈ రుణాలు 2010 డిసెంబరు 16 నాటికి రూ.90.21 కోట్లకు చేరాయి. అదే రోజున ఈ మొత్తం రుణ బకాయిలను, ఏజేఎల్‌కు చెందిన 99.99 శాతం షేర్లను యంగ్‌ ఇండియన్‌కు ఏఐసీసీ బదలాయించింది. ప్రతిగా యంగ్‌ ఇండియన్‌ కంపెనీ రూ.50 లక్షలు చెల్లించింది. అంతకు మూడు రోజుల ముందే యంగ్‌ ఇండియన్‌ కంపెనీ తొలి మేనేజింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, రాహుల్‌ గాంధీని డైరెక్టర్‌గా నియమించారు.


ఏజేఎల్‌ ఆస్తులు ఇవీ..

ఏజేఎల్‌ రియల్‌ ఎస్టేట్‌ విలువను రూ.5 వేల కోట్లుగా అంచనా వేశారు. ఆ సంస్థకు హెరాల్డ్‌ హౌస్‌ పేరిట ఢిల్లీలో 10,000 చదరపు మీటర్ల స్థలంలో 6 అంతస్థుల భవనం ఉంది. దీంతోపాటు లఖ్‌నవూ, భోపాల్‌, ముంబై, ఇండోర్‌, పట్నా, పంచకుల తదితర ప్రాంతాల్లోనూ ఆ సంస్థకు ఆస్తులు ఉన్నాయి.


యంగ్‌ ఇండియన్‌ అనేది ఒక ప్రైవేటు కంపెనీ. దీన్ని 2010 నవంబరు 23న స్థాపించారు. ఇందులో సోనియా, రాహుల్‌లకు సంయుక్తంగా మెజారిటీ(76 శాతం) షేర్లు ఉన్నాయి. మిగిలిన 24 శాతం షేర్లు కాంగ్రెస్‌ నేతలు మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌(చెరో 12 శాతం) పేరిట ఉన్నాయి. ఢిల్లీలోని హెరాల్డ్‌ హౌస్‌లోనే ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. 2011 జనవరి 22న యంగ్‌ ఇండియన్‌ సంస్థకు తాజా షేర్ల కేటాయింపు జరిపారు. ఏజేఎల్‌ షేర్ల స్వాధీనం 100 శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో రూ.47,513 విలువైన షేర్లను రాహుల్‌గాంధీ, రూ.2,62,411 విలువైన షేర్లను ఆయన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా.. రతన్‌ దీప్‌ ట్రస్ట్‌, జన్‌హిత్‌ నిధి ట్రస్ట్‌ల ద్వారా కొనుగోలు చేశారని, ఇందులో కంపెనీల చట్టం నిబంధనలను పాటించలేదని ప్రధాన అభియోగం. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఏజేఎల్‌కు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను సొంతం చేసుకోడానికి కాంగ్రెస్‌ పార్టీ నిధులను సోనియా, రాహుల్‌ వాడుకున్నారని, ఆ సంస్థ భూములనూ కాజేసి ఆర్థిక మోసాలకూ పాల్పడ్డారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.

Updated Date - 2022-06-21T02:30:25+05:30 IST