‘లంపీ’ చర్మ వ్యాధికి దేశీయ వ్యాక్సిన్‌ రెడీ

ABN , First Publish Date - 2022-09-13T10:09:39+05:30 IST

పశువుల్లో వ్యాపిస్తున్న లంపీ చర్మ వ్యాధి (ఎల్‌ఎ్‌సడీ)ని అరికట్టేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ సిద్ధమైందని ప్రధాని మోదీ చెప్పారు.

‘లంపీ’ చర్మ వ్యాధికి దేశీయ వ్యాక్సిన్‌ రెడీ

  • డెయిరీ పశువుల కదలికలపై నిఘా..
  •  పాల ఉత్పత్తిలో 6% వృద్ధి: ప్రధాని

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: పశువుల్లో వ్యాపిస్తున్న లంపీ చర్మ వ్యాధి (ఎల్‌ఎ్‌సడీ)ని అరికట్టేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ సిద్ధమైందని ప్రధాని మోదీ చెప్పారు. వ్యాధి నియంత్రణకు జంతువుల కదలికలను ట్రాక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆయన సోమవారమిక్కడ గ్రేటర్‌ నోయిడాలో అంతర్జాతీయ డెయిరీ సమాఖ్య ప్రపంచ డెయిరీ సదస్సు-2022ని ప్రారంభించారు. జంతువుల్లో ఎల్‌ఎ్‌సడీ ప్రధాన ముప్పుగా పరిణమించిందని.. ఇది రైతులను, వారి ఆదాయాన్ని కూడా ప్రభావితం చేస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. పశువులను బయోమెట్రిక్‌ ద్వారా గుర్తిస్తున్నామని.. దీనికి ‘పశు ఆధార్‌’ అని పేరు పెట్టామన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తి రెండు శాతం పెరుగగా.. మన దేశంలో ఆరు శాతం పెరిగింది. 2014లో దేశంలో పాల ఉత్పత్తి 146 మిలియన్‌ టన్నులుగా ఉండేది. అది ఇప్పుడు 210 మిలియన్‌ టన్నులకు చేరింది. అంటే 44 శాతం వృద్ధి. చిన్న రైతుల కృషి కారణంగా భారతదేశం అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించింది. 8 కోట్ల మందికిపైగా రైతులకు జీవనోపాధి కల్పిస్తోంది. 2 లక్షలకు పైగా గ్రామాల్లో సహకార సంఘాలు రోజుకు రెండు సార్లు రెండు కోట్ల మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. ఈ ప్రక్రియలో ఎక్కడా దళారులు లేరు. వినియోగదారుల నుంచి వచ్చే సొమ్ములో 70 శాతం నేరుగా రైతులకే వెళ్తోంది. భారత డెయిరీ రంగం విలువ రూ.8.5 లక్షల కోట్లు. వరి, గోధుమ మొత్తం దిగుబడికంటే ఇది ఎక్కువ’ అని ప్రధాని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, సహాయ మంత్రి సంజీవ్‌ బలియాన్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-13T10:09:39+05:30 IST