CBI Charge Sheet: డీఎంకే నేత రాజాపై సీబీఐ చార్జిషీటు

ABN , First Publish Date - 2022-10-12T15:17:57+05:30 IST

డీఎంకే సీనియర్‌ నేత, లోక్‌సభ సభ్యుడు ఎ.రాజా(A. Raja) అక్రమార్జన కేసులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఆయన కేంద్రమంత్రిగా ఉన్న

CBI Charge Sheet: డీఎంకే నేత రాజాపై సీబీఐ చార్జిషీటు

చెన్నై, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): డీఎంకే సీనియర్‌ నేత, లోక్‌సభ సభ్యుడు ఎ.రాజా(A. Raja) అక్రమార్జన కేసులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఆయన కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదు చేసిన కేసులో చార్జిషీటు మరో అడుగు ముందుకేసింది. రాజా కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2జీ స్పెక్ట్రమ్‌(2G spectrum) కేటాయింపుల్లో భారీ యెత్తున అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ(CBI) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసుపై విచారణ జరిపిన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఆ కేసులోని నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీలు పిటిషన్‌ వేసింది. ఇదిలా ఉండగా రాజా, ఆయన కుటుంబీకులు, అనుచరులు సహా మొత్తం 16 మంది అక్రమార్జనకు పాల్పడినట్లు 2015 ఆగస్టు 18న సీబీఐ కేసు నమోదు చేసింది. 1999 నుంచి 2010 వరకు రాజా  అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపించింది. రాజా మంత్రిగా తన పలుకుబడి ఉపయోగించి ఆదాయానికి మించి రూ.27.92 కోట్ల మేరకు ఆస్తులు సంపాదించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత తిరుచ్చి, నీలగిరి, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో రాజా, ఆయన కుటుంబసభ్యులు గృహాలు, కార్యాలయాలు, అనుచరుల నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు జరిపారు. 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో లభించిన కొన్ని పత్రాల ఆధారంగా తనిఖీలు చేసినట్టు సీబీఐ అప్పట్లో ప్రకటించింది. ఆ తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలన్నింటినీ పరిశీలించిన  ఏడేళ్ల తర్వాత ప్రత్యేక కోర్టులో రాజాపై చార్జ్‌షీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో రాజా ఆదాయానికి మించి రూ.5.53 కోట్ల మేరకు అక్రమార్జనకు పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. కాగా సీబీఐ చార్జిషీట్‌తో డీఎంకేలో మళ్లీ ఆందోళన మొదలైంది.

Updated Date - 2022-10-12T15:17:57+05:30 IST