DK Shivakumar: 136 స్థానాల్లో విజయం మాదే..
ABN , First Publish Date - 2022-12-16T11:46:24+05:30 IST
రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికలలో 136 స్థానాలలో గెలుపు తమదేనని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(State Congress President DK Si
- మరో వందరోజులే బీజేపీ పాలన
- అభివృద్ధిలో కాదు అవినీతిలో నెంబర్ వన్
- మీట్ ది ప్రెస్‌లో డీకే శివకుమార్
బెంగళూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికలలో 136 స్థానాలలో గెలుపు తమదేనని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(State Congress President DK Sivakumar) ధీమా వ్యక్తం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీట్‌దిప్రెస్ జరిగింది. ఈసందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల తరుపున నిరంతరంగా పోరాటాలు చేస్తున్నా మని, రెండేళ్ళుకు పైగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ, సమస్యల సాధన కోసం రోడ్డెక్కామన్నారు. ఎన్నికలు వచ్చాయని బీజేపీ ‘ప్రజాసంకల్ప’ పేరుతోను జేడీఎస్ పేరు చెప్పకుండా ‘పంచతంత్రగా’ యాత్రలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు భావనాత్మక బీజేపీకి, ప్రతి వ్యక్తి బతుకు కోసం పాటుపడే కాంగ్రెస్‌ల మధ్య జరుగుతాయన్నారు. కొవిడ్ వంటి క్లిష్ట కాలం నుంచి నేటి దాకా నిద్రను మానుకుని ప్రజల మధ్యే ఉన్నామన్నారు. స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ దాకా ఎన్నుకునే విధానమే ప్రజాసామ్య విధానమన్నారు. కానీ రాష్ట్రంలో తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీ ఎన్నికలను జరుపకుండా వాయిదాలు వేస్తూ కోర్టు నుంచి ఐదులక్షల జరిమానా వేయించుకోవడం సిగ్గుచేటు అని ముఖ్యమంత్రి బొమ్మై(Chief Minister Bommai) నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలన్నారు. స్థానిక ఎన్నికలలో అధికార బీజేపీకి సమానంగా గెలుస్తున్నామనే భయం వారిని వెంటాడుతోందన్నారు. మూడేళ్ళలో ప్రజలకు కడుపునింపే ఒక పథకం కూడా అమలు చేయలేదని పైగా ప్రతి విభాగంలోను అవినీతిలో కూరుకుపోయారన్నారు. దేశంలోనే నంబర్‌వన్ అవినీతి రాష్ట్రంగా కర్ణాటకకు పేరొచ్చిందన్నారు. చివరకు ఓటరు జాబితాను దారి తప్పించారని కానీ ఉద్యోగులు మాత్రమే బలవుతున్నారని అసలు సూత్రధారులు తప్పించుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికలు ముంచుకొస్తున్నాయని కుక్కర్ బాంబ్ అంశం వెలుగులోకి వచ్చిందని విచారణ జరుపకుండానే డీజీపీ అనుమానిత ఉగ్రవాదిగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల లో కాంగ్రెస్‌దే గెలుపు అన్నారు. ఇ టీవల జరిపిన సర్వేలో కాంగ్రెస్‌కు 136 స్థానాలు వస్తాయని తేలిందని బీజేపీకి 60-70 స్థానాలు మాత్రమే అన్నారు. కానీ జేడీఎస్ గురించి మరోసారి చెబుతానంటూ దాటవేశారు. గుజరాత్ ప్రభావం రాష్ట్రంలో ఉండదని తేల్చి చెప్పారు. ముస్లింలకు టికెట్‌లు ఇచ్చే విషయమై ప్రస్తావి స్తూ వందదాకా దరఖాస్తులు వచ్చాయన్నారు. కొన్ని జిల్లాలో తాము అర్జీలు కోరామన్నారు. సిద్దరామయ్యతో ఎటువంటి విభేధాలు లేవని అగ్రనేతలు మమ్ములను రాజీచేసే చర్చలు జరుగలేదన్నారు. మాపార్టీలో సీఎంలు కావాలనుకునే అంశం బీజేపీ చర్చించడం ఓటమిని అంగీకరించడం కాదా అని ప్రశ్నించారు. నేను రౌడీషీటర్ అనేందుకు ఎక్కడైనా ఆధారాలుంటే చూపాలని సవాల్ విసిరారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ పరిచయం చేసే వేళ కాబోయే సీఎం వర్ఛస్సు కలిగినవారని ప్రస్తావించడం చర్చకు కారణమైంది. ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి మల్లప్ప, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వైపు మరో బీజేపీ ఎమ్మెల్సీ...
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరో అధికార బీజేపీ ఎమ్మెల్సీ సభ్యుడు సిద్దంగా ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న పుట్టణ్ణ కాం గ్రెస్ లో చేరనున్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే సందర్భంగా క్రియాశీలకంగా వ్యవహరించిన పుట్టణ్ణ ఆతర్వాత పార్టీకి చెందిన కొందరి నేతల తీరుతో విసుగుచెంది దూరంగా ఉంటూ వచ్చారు. దాదాపు ఏడాదికి పైగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా గడుపుతున్న పుట్టణ్ణ గుడ్‌బై చెప్పందుకు సిద్దంగా ఉన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీగా జేడీఎస్ నుంచి గెలుపొందిన పుట్టణ్ణ 2019లో పార్టీ వీడారు. ఆతర్వాత బీజేపీలో చేరి మరోసారి ఎమ్మెల్సీగా గెలుపొందారు. రానున్న ఎన్నికలలోగానే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీ అదికారంలోకి వచ్చాక మంత్రి పదవిని ఆశించిన పుట్టణ్ణకు అవకాశం లభించకపోవడంతో వ్యతిరేకమయ్యారు. ఇలా ఇరువురు ఎమ్మెల్సీలు అధికార బీజేపీని వీడటం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.