ఇద్దరూ హేమాహేమీలే

ABN , First Publish Date - 2022-09-30T06:41:21+05:30 IST

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలోకి దిగ్విజయ్‌ సింగ్‌, శశి థరూర్‌ సాదాసీదా నాయకులు కాదు. ప్రజలు డిగ్గీ రాజాగా పిలుచుకునే దిగ్విజయ్‌

ఇద్దరూ హేమాహేమీలే

కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగ్విజయ్‌, థరూర్‌

ఉత్తరాది, దక్షిణాదికి పోటీగా విశ్లేషణ


న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలోకి దిగ్విజయ్‌ సింగ్‌, శశి థరూర్‌ సాదాసీదా నాయకులు కాదు. ప్రజలు డిగ్గీ రాజాగా పిలుచుకునే దిగ్విజయ్‌ రాజపుత్రుడు. ఒకప్పటి రాజోఘర్‌ సంస్థానం రాజు బలభద్రసింగ్‌ తనయుడు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుడు. లండన్‌లో పుట్టి ఢిల్లీ స్టీఫెన్స్‌ కాలేజీలో చదివి అంతర్జాతీయ సంబంధాల్లో ఉన్నత విద్య అభ్యసించి ఐక్యరాజ్యసమితి అండర్‌ సెక్రటరీ జనరల్‌ స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి శశి థరూర్‌. వీరిద్దరి మధ్య గట్టి పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా ఇది కాంగ్రె్‌సలో ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య పోరుగా పరిగణించవచ్చు. 


మునిసిపల్‌ చైర్మన్‌ నుంచి... 

స్వాతంత్య్రం రావడానికి ఆరు నెలల ముందు జన్మించిన 75 సంవత్సరాల దిగ్విజయ్‌  రాజకీయాల్లో తలపండిన నేత. 1969లోనే రాజోఘర్‌ మునిసిపల్‌ చైర్మన్‌గా వ్యవహరించిన దిగ్విజయ్‌ జనసం్‌ఘలో చేరే అవకాశం వచ్చినప్పటికీ తిరస్కరించి 1970లో కాంగ్రె్‌సలో చేరి అప్పటి నుంచి పార్టీకి విధేయంగా ఉన్నారు. 1980-84 మధ్య అర్జున్‌ సింగ్‌ కేబినెట్‌లో మంత్రిగా, 1985-88 మధ్య మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1993 నుంచి 2003 వరకు రెండుసార్లు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌ సహా అనేక రాష్ట్రాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా థాకూర్‌ చేతిలో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనను రాజ్యసభ సభ్యుడిగా నియమించింది. అందరికీ అందుబాటులో ఉంటూ హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన డిగ్గీ రాజా గురించి దేశమంతటా కాంగ్రె్‌సలో ప్రతి ఒక్కరికీ తెలుసు.


లండన్‌లో పుట్టి.. ఐరాసలో రాణించి...

డిగ్గీ రాజాతో పోటీ పడుతున్న మలయాళీ మల్లుడు, 66 సంవత్సరాల శశిథరూర్‌ కూడా సామాన్యుడు కాదు. అనంత పద్మనాభస్వామి కొలువున్న తిరువనంతపురానికి చెందిన శశిథరూర్‌ తండ్రి చందన్‌ థరూర్‌ లండన్‌లో ‘స్టేట్స్‌మన్‌’లో అడ్వర్టైజ్‌మెంట్‌ మేనేజర్‌గా పనిచేశారు. ఆయన మేనమామ పరమేశ్వరన్‌ ‘రీడర్స్‌ డైజెస్ట్‌’ వ్యవస్థాపకుడు. శశిథరూర్‌ రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం భారతదేశానికి తిరిగివచ్చింది. ముంబై, కోల్‌కతా, ఢిల్లీలో చదివిన తర్వాత ఆయన లండన్‌లో ఫ్లెచ్చర్‌ స్కూల్‌ ఆఫ్‌ లాలో ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో పీజీ, డాక్టరేట్‌ చేశారు. 1978-2007లో ఐక్యరాజ్య సమితికి చెందిన యూఎన్‌హెచ్‌సీఆర్‌లో చేరి యూఎన్‌ అండర్‌ సెక్రటరీ జనరల్‌ స్థాయి వరకూ ఎదిగారు. 2006లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ పదవికి దక్షిణ కొరియా దౌత్యవేత్త బాంకీమూన్‌తో పోటీ పడి రెండో స్థానం పొందారు. ఆ తర్వాత దేశానికి తిరిగి వచ్చి 2009లో కాంగ్రె్‌సలో చేరారు. మూడుసార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు.


యూపీఏ హయాంలో పట్టణాభివృద్ది, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. విదేశాంగ వ్యవహారాల కాలమిస్టుగా పేరుపొందిన శశిథరూర్‌ రాసిన పుస్తకాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ఆయన రాసిన ‘వై ఐ యామ్‌ ఏ హిందూ’ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. అనర్గళంగా, కఠినమైన పదజాలంతో గుక్కతిప్పుకోకుండా ఆంగ్లంలో మాట్లాడగలిగిన శశిథరూర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న విద్యాధికుల్లో ఒకరు. రాజకీయాల్లో తలపండిన డిగ్గీరాజా గెలుస్తారా, లేక దౌత్యనీతిలో ఆరితేరిన శశిథరూర్‌ గెలుస్తారా అన్నది వేచి చూడాల్సిందే. Read more