Maharashtra Crisis: మాజీ సీఎం ఫడ్నవీస్‌తో శివసేన రెబల్ నేత షిండే రహస్య మంతనాలు?
ABN , First Publish Date - 2022-06-26T16:21:35+05:30 IST
మహారాష్ట్ర అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శివసేన తిరుగుబాటు నేత

ముంబై : మహారాష్ట్ర అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే శుక్రవారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో అత్యంత రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ గుజరాత్‌లోని వడోదరలో సమావేశమైనట్లు సమాచారం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అదే సమయంలో వడోదర చేరుకోవడం. నర్మద జిల్లాలోని ఏక్తా నగర్ (కేవడియా)లో శని, ఆదివారాల్లో పర్యటించేందుకు అమిత్ ఇక్కడికి వచ్చారు.
ఏక్నాథ్ షిండేతో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా గువాహటిలోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. షిండే ఇక్కడి నుంచి రహస్యంగా వడోదర చేరుకుని, దేవేంద్ర ఫడ్నవీస్‌తో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చర్చల అనంతరం శనివారం తెల్లవారుజామునే తిరిగి షిండే గువాహటి హోటల్‌కు వెళ్ళినట్లు తెలుస్తోంది.
దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం సాయంత్రం ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ఇండోర్ నుంచి వడోదర వెళ్ళినట్లు చెప్తున్నారు. వడోదర నుంచి తిరిగి ఇండోర్ వెళ్ళారని, ఆ తర్వాత ముంబై వెళ్లేందుకు బయల్దేరారని కొందరు చెప్తున్నారు. అయితే ఈ ప్రయాణాల సమయంలో ఆయనతోపాటు ఎవరూ లేనట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా, ఏక్నాథ్ షిండే గురువారం మాట్లాడుతూ, తనకు ఓ జాతీయ పార్టీ మద్దతు ఉందని చెప్పారు. అయితే ఆ పార్టీ బీజేపీ అని మాత్రం చెప్పలేదు. దీనిపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందిస్తూ, శాసన సభలో ఆధిక్యతను నిరూపించుకునే సమయంలో బీజేపీ నేతలెవరూ షిండే వర్గానికి మార్గదర్శనం చేయకూడదన్నారు.
తమను శివసేన బాలా సాహెబ్‌గా పిలవాలని షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం కోరింది. బాలా సాహెబ్ పేరును వాడుకోరాదని శివసేన హెచ్చరించింది.
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి మహారాష్ట్ర వికాస్ అగాడీగా ఏర్పడి, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.