భారత్‌లోనూ నియంతృత్వ పోకడలు!

ABN , First Publish Date - 2022-04-24T07:46:07+05:30 IST

భారత్‌లోనూ నియంతృత్వ పోకడలు ఉన్నట్లు అర్థం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లోనూ నియంతృత్వ పోకడలు!

అలా అర్థం వచ్చేలా మాట్లాడిన బైడెన్‌

రష్యా, చైనాల సరసన చేర్చి వ్యాఖ్యలు

రష్యా ఆయుధ పరిశ్రమ కుప్పకూలింది

వాళ్లను నమ్మితే మునుగుడే: పెంటగాన్‌


వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 23: భారత్‌లోనూ నియంతృత్వ పోకడలు ఉన్నట్లు అర్థం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనాల్లో నియంతృత్వం గురించి మాట్లాడుతూ భారత్‌ పేరునూ ప్రస్తావించారు. శుక్రవారం ఆయన డెమోక్రాట్ల ఫండ్‌ రైజింగ్‌ విందులో మాట్లాడారు. మొదట చైనా గురించి ప్రస్తావించారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో క్వాడ్‌ కూటమి దేశాలు చైనాకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని జిన్‌పింగ్‌ తనకు ఫిర్యాదు చేశారని బైడెన్‌ చెప్పారు. తమకు వ్యతిరేకంగా చైనా తీసుకుంటున్న

చర్యలే నాలుగు దేశాలను (అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌) క్వాడ్‌ రూపంలో ఏకమయ్యేట్లు చేశాయని తాను బదులిచ్చానని వెల్లడించారు.


రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఏ ఫలితాన్ని ఆశించి ఉక్రెయిన్‌పై దురాక్రమణకు తెగబడ్డారో ఇప్పుడు పూర్తిగా దానికి భిన్నంగా జరుగుతోందని బైడెన్‌ వ్యాఖ్యానించారు. స్వీడన్‌, ఫిన్లాండ్‌లు కూడా నాటో కూటమిలో చేరుతున్నాయని గుర్తు చేశారు. ఇదే సందర్భంలో ఆయన భారత్‌ ప్రస్తావన చేశారు. ఈ దేశాలతో పాటు భారత్‌కు కూడా తన సొంత సమస్యలు ఉన్నట్లు చెప్పారు. రష్యా, చైనా, ఫిలిఫ్పైన్స్‌ సహా చాలా దేశాల్లో నియంతృత్వాలు ఉన్నాయని, వాటి విషయంలో కలిసి పని చేయాలని అభిప్రాయపడ్డారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే నాటోను తేలిగ్గా ముక్కలు చేయొచ్చని రష్యా అధ్యక్షుడు భావించారన్నారు. రష్యా విస్తరణవాద విదేశాంగ విధానానికి ఫిన్లాండ్‌ తరహాలో యూరప్‌ దేశాలన్నీ డూడూ బసవన్నలా తల ఆడిస్తాయని పుతిన్‌ భావించారని, ఇప్పుడు ఏకంగా ఫిన్లాండ్‌ కూడా తన విధానాన్ని మార్చుకొని నాటోలో చేరుతోందని ప్రస్తావించారు.

ఉక్రెయిన్‌ భాషలు, రష్యా భాష ఒకే స్లావిక్‌ భాషా కుటుంబానికి చెందడం, చాలామంది ఉక్రెయిన్లు రష్యా భాషను మాట్లాడటం.... ఇవన్నీ చూసి ఉక్రెయిన్‌ ప్రజలు తనకు బ్రహ్మరథం పడతారని పుతిన్‌ ఆశించారని, అందుకు పూర్తి భిన్నంగా జరిగిందని బైడెన్‌ వ్యాఖ్యానించారు.

 

రష్యాపై ఆధారపడొద్దు

పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమలు కుంటుపడ్డాయని, ఈ నేపథ్యంలో భారత్‌ ఆయుధాల కోసం రష్యా మీద ఆధారపడక పోవడమే మంచిదని పెంటగన్‌ మీడియా ప్రతినిధి జాన్‌ కిర్బీ సూచించారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత కల్పించడంలో భారత్‌ పాత్రను అమెరికా గుర్తిస్తోందన్నారు. చైనా విషయంలో భారత్‌ ఆందోళన చెందుతోంది. రష్యా ఆయుధాలతో సైన్యాన్ని మోహరించడం మంచిది కాదు. పశ్చిమ దేశాల ఆంక్షలతో కుప్పకూలిన రష్యా ఆయుధ పరిశ్రమ ఎప్పటికీ కోలుకోదు’’ అన్నారు. 

Updated Date - 2022-04-24T07:46:07+05:30 IST