storm in America: మృత్యువై కురిసి..

ABN , First Publish Date - 2022-12-27T04:33:52+05:30 IST

మంచు తుఫాను అమెరికా, జపాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికాలో బాంబ్‌ తుఫాను ప్రభావం ఇంకా బీభత్సంగానే ఉంది. తీవ్ర హిమపాతానికి అమెరికా వ్యాప్తంగా కనీసం 59 మంది చనిపోయారు.

 storm in America: మృత్యువై కురిసి..

అమెరికాలో మంచు తుఫాన్‌.. 59కి చేరిన మరణాలు

ఎరీకంట్రీలోనే 25 మరణాలు

లూన్‌ లేక్‌ వద్ద బస్సుబోల్తా.. నలుగురి మృతి

జపానూ ఉక్కిరిబిక్కిరి..

అక్కడ 17కు మృతుల సంఖ్య

వాషింగ్టన్‌/టోక్యో, డిసెంబరు 26: మంచు తుఫాను అమెరికా, జపాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికాలో బాంబ్‌ తుఫాను ప్రభావం ఇంకా బీభత్సంగానే ఉంది. తీవ్ర హిమపాతానికి అమెరికా వ్యాప్తంగా కనీసం 59 మంది చనిపోయారు. న్యూయార్క్‌ పశ్చిమాన ఉన్న ఎరీకంట్రీలోనే 25 మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వాన్‌కోవర్‌ నగరానికి 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న లూన్‌ లేక్‌ వద్ద.. క్రిస్మస్‌ వేడుకలకు వెళ్తున్న ప్రయాణికుల బస్సు మంచుకారణంగా అదుపుతప్పి, బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు వెల్లడించారు. 52 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. మంచు తుఫానులో లక్షలమంది చిక్కుకుపోవడం, ఇళ్ల నుంచి జనాలు బయటకొచ్చే పరిస్థితి లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు.

1winter22_000021B.jpg

రాకీ పర్వతశ్రేణి నుంచి అప్లాచైన్‌ పర్వతాల దాకా చలి విపరీతంగా పెరిగిపోవడంతో జాగ్రత్తగా ఉండాలంటూ ఉత్తర అమెరికాలో దాదాపు 60శాతం జనాభాకు హెచ్చరికలు జారీ అయినట్లుగా అమెరికా జాతీయ వాతావరణ సేవావిభాగం పేర్కొంది. ఇంకా 5.5 కోట్ల మందిపై మంచు తుఫాను ప్రభావం కొనసాగుతోందని తెలిపింది. ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలో ఇళ్లలోనూ మంచు పేరుకుపోవడం, కరెంటు కోతల కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

18 లక్షల ఇళ్లకు కరెంటు లేదని అధికారులు పేర్కొన్నారు. గ్రేట్‌ లేక్స్‌, న్యూయార్క్‌లోని బఫెలో నగర సమీపంలో హిమపాతానికి తోడు శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. బఫెలో విమానాశ్రయంలో మీటరు మేర మంచు పేరుకుపోయింది. అమెరికా వ్యాప్తంగా పలు చోట్ల ఇదే పరిస్థితి ఉండటంతో ఆదివారం ఒక్కరోజే 1,707 దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. జపాన్‌లో హిమపాతానికి ఆ దేశ వ్యాప్తంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

1winter_000016A-(1).jpg

ఉత్తరాదిపై దట్టమైన పొగమంచు

అతి దట్టమైన పొగమంచు, తీవ్రమైన వణుకు పుట్టించే చలిగాలులు ఉత్తర, వాయవ్య భారత దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో పలు పట్టణాలు, నగరాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల వరకే పరిసరాలు కనిపిస్తున్నాయి. దీంతో రోడ్డు, రైలు మార్గాల్లో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. తీవ్రమైన చలి, పొగ మంచుతో రాజస్థాన్‌ వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి సికర్‌ ఫతేపూర్‌లో -0.5, చురూలో 0, పిలానీలో 0.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కశ్మీరు లోయలో ఉష్ణోగ్రతలు ఇంకా సున్నా కంటే తక్కువగానే ఉన్నాయి. శ్రీనగర్‌లో -3.5 డిగ్రీలకు చేరింది. అమర్‌నాథ్‌ యాత్ర బేస్‌ క్యాంపు అయిన పహల్గామ్‌లో -5.7 డిగ్రీల అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2022-12-27T04:33:53+05:30 IST