దీర్ఘకాల కిడ్నీ వ్యాధులకు డపాగ్లిఫ్లోజిన్
ABN , First Publish Date - 2022-11-30T02:40:47+05:30 IST
దీర్ఘకాల కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న మధుమేహ రోగులకు కొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది.
అనుమతించిన ఔషధ నియంత్రణ సంస్థ
న్యూఢిల్లీ, నవంబరు 29: దీర్ఘకాల కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న మధుమేహ రోగులకు కొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా రూపొందించిన డపాగ్లిఫ్లోజిన్ అనే ఔషధానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎ్‌ససీవో) మంగళవారం అనుమతి మంజూరుచేసింది. దీర్ఘకాల కిడ్నీ సమస్యల కారణంగా వయోజనుల్లో తలెత్తే గుండె సంబంధ వ్యాధులు, అలాగే హృద్రోగ మరణాలను తగ్గించడానికి ఈ ఔషధం ఉపయోగపడుతుందని ఆస్ట్రాజెనెకా ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఔషధంతో హృద్రోగాల కారణంగా ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గుతుందని తెలిపింది. ఈ తరహా ఔషధానికి అనుమతి లభించడం ఇదే మొదటిసారని కంపెనీ పేర్కొంది. సీడీఎ్‌ససీవో అనుమతి ప్రకారం... మధుమేహం ఉన్నా, లేకపోయినా, దీర్ఘకాల కిడ్నీ సమస్యలతో బాధపడేవారు డపాగ్లిఫ్లోజిన్‌ను వాడొచ్చని స్పష్టంచేసింది.